Jeff Bezos | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంస్థలో తన షేర్లను విక్రయించారు. 12 మిలియన్ల షేర్లను గత బుధ, గురువారాల్లో విక్రయించారు. వాటి విలువ 200 కోట్ల డాలర్ల పై చిలుకు (సుమారు రూ.16 వేల కోట్లు). సంస్థ సీఈఓగా వైదొలిగిన తర్వాత 2021 నుంచి అమెజాన్లో జెఫ్ బెజోస్ తన షేర్లను విక్రయించడం ఇదే మొదటిసారి. వచ్చే 12 నెలల్లో అమెజాన్ సంస్థలో 50 మిలియన్ల షేర్లను విక్రయిస్తానని ఈ నెల రెండో తేదీన జెఫ్ బెజోస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో షేర్ 168-171 డాలర్ల విలువకు విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఆయన చెప్పారు.
2002 నుంచి అమెజాన్ వ్యవస్థాపకుడిగా జెఫ్ బెజోస్ 30 బిలియన్ డాలర్లకు పైగా విక్రయించాడు. 2020, 2021ల్లోనే సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. గత నవంబర్ నెలలో స్వచ్ఛంద సంస్థలకు దాదాపు 230 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను గిఫ్టులుగా పంపిణీ చేశారు.గత 12 నెలల్లో అమెజాన్ షేర్ 78 శాతం పెరిగింది. గతేడాది ఫిబ్రవరి నాటికి జెఫ్ బెజోస్ కు సంస్థలో 12.3 శాతం వాటా ఉంది. ఆయన తన ప్రణాళికలో భాగంగా 50 మిలియన్ల షేర్లు విక్రయించినా ఆయన వద్ద 11.8 శాతం వాటా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 195.5 బిలియన్ డాలర్లు, లగ్జరీ వస్తువుల తయారీ సంస్థ ఎల్వీఎంహెచ్ సీఈఓ బెర్నాల్ట్ అర్నాల్ట్, టెస్లా-ట్విట్టర్-స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.