Discounts- EV Cars – Scooters | ఫెస్టివ్ సీజన్లో డిమాండ్‌ను మించి ఉత్పత్తి చేయడంతో పేరుకుపోయిన ఈవీ కార్లు, స్కూటర్ల నిల్వలు.. కాంపొనెంట్స్ ఖర్చు తక్కువ, కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీ (కేఫ్) నియంత్రణలు, తదితర కారణాల రీత్యా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ కార్లూ, టూ వీలర్స్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కార్ల ధరలపై రూ.3 లక్షల వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మోడల్స్‌ను బట్టి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద 10-20 శాతం డిస్కౌంట్లు ప్రకటించాయి ఆయా సంస్థలు. ప్రత్యేకించి విదా వీ1 ప్రో, విదా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్లపై హీరో మోటో కార్ప్ రూ.25,000, రూ.10,000 క్యాష్ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. ఇక ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా బుక్ చేసుకుంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద రూ.2,500 నుంచి రూ.5,000 వరకూ డిస్కౌంట్లు పొందొచ్చు. రిట్జాపై రూ.3,000-రూ.6,700 మధ్య, ఎథేర్ 450 మీద రూ.5,000-రూ.7,000 మధ్య ఏథేర్ తన స్కూటర్లపైనా డిస్కౌంట్లు ప్రకటించింది. వీటికి తోడు డీలర్ షిప్‌లు ట్రేడ్ బోనస్ రూ.3,000 – రూ.5,000 తోపాటు రూ.15 వేల వరకూ ఎక్స్చేంజ్ బోనస్ లు ఇస్తున్నాయి.
ఫెస్టివల్ సీజన్, పోస్ట్ ఫెస్టివల్ సీజన్లో అవసరాన్ని మించి ఉత్పత్తి చేయడం వల్ల నిల్వలు పేరుకు పోయాయని ఇక్రా (కార్పొరేట్ రేటింగ్స్) కో-గ్రూప్ హెడ్ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కుమార్ కృష్ణమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈవీ కార్లు, ఈవీ స్కూటర్లపై డిస్కౌంట్లు, ప్రమోషన్ల ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అంతర్జాతీయ ట్రెండ్‌కనుగుణంగా ఈవీల సేల్స్ గ్రోత్ తగ్గిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈవీ కార్లు, స్కూటర్ల విక్రయాలు దాదాపు 5.5 శాతం పెరుగుతాయని ఇక్రా అంచనా వేసింది. 2030 నాటికి 25 శాతం ఎలక్ట్రిక్ టూ వీలర్స్, 15 శాతం ఈవీ కార్ల అమ్మకాలు జరుగుతాయని ఇక్రా అంచనా వేసింది.