Credit Card-UPI | ఇప్పుడు దేశంలో కోట్లాది మంది భారతీయులు యూపీఐ (UPI) ఆధారిత పేమెంట్స్.. అంటే జీ-పే, ఫోన్‌పే, పేటీఎం, భారత్ పే వంటి యాప్ ఆధారిత చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ బ్యాంకుల ఖాతాదారుల డెబిట్ కార్డును యూపీఐ లింక్డ్ మొబైల్ యాప్స్‌కు అనుసంధానించి ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు వీలుంది. తాజాగా డెబిట్ కార్డులతోపాటు క్రెడిట్ కార్డులను కూడా యూపీఐకి జత చేయవచ్చు. యూపీఐ పేమెంట్స్‌పై క్రెడిట్ కార్డు వాడకం ఎంత వరకు బెనిఫిట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..
క్యాష్ లెస్ పేమెంట్స్ నిర్వహణలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ (యూపీఐ) ఒక విప్లవాత్మక మార్పుకు కారణమైంది. క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడంతోపాటు ఇందులో రెండంచెల సెక్యూరిటీ వంటి పలు అంశాలతో సేఫ్టీ మార్గంగా యూపీఐని వాడుతుఉన్నారు. ఇప్పటిదాక సేవింగ్స్ అకౌంట్స్ ఆధారంగా బ్యాంకులు జారీచేసే డెబిట్ కార్డులను యూపీఐ పేమెంట్స్‌కు లింక్ చేయడానికి వీలైంది.దీనివల్ల నేరుగా సంబంధిత వ్యక్తి ఖాతా నుంచి క్యాష్ డెబిట్ అవుతుంది. యూపీఐ సేవలను మరింత విస్తరించడానికి రూపే క్రెడిట్ కార్డు (Rupay Credit Card) వాడకాన్ని ప్రోత్సహించ తలపెట్టింది ఆర్బీఐ. ఇందుకోసం యూపీఐతో క్రెడిట్ కార్డులను అనుసంధానించడానికి అనుమతించింది. ఇప్పుడు అన్ని నెట్‌వర్క్‌ల క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేయడానికి వీలు కల్పిస్తున్నది. కనుక మన దగ్గర క్యాష్ లేకపోయినా క్రెడిట్ కార్డుతో అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వెసులుబాటు లభిస్తుంది.
అయితే కొన్ని ఫిన్ టెక్ సంస్థలు తమ ఖాతాదారులను ఆకర్షించడానికి ‘ఇప్పుడు కొనండి.. తర్వాత పే చేయండి (బీఎన్‌పీఎల్)’ సేవలను ప్రారంభించాయి. ఈ యాప్‌లు 15-30 రోజుల స్వల్ప వ్యవధిలో రుణాలిస్తాయి. ఇక ఇప్పుడు క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేయడంతో రుణం తీసుకోకుండానే ఈ బెనిఫిట్ లభించినట్లయింది.
మొబైల్ ఫోన్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు గనుక వెంట క్రెడిట్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వ్యాపారి లేదా మర్చంట్ సంస్థ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్ కార్డుతో పే చేయవచ్చు. మొబైల్ ఫోన్ల రీచార్జీ, విద్యుత్ బిల్లుల పేమెంట్స్ వంటి చెల్లింపులు కూడా యూపీఐకి అనుసంధానించిన క్రెడిట్ కార్డుతో పూర్తి చేయొచ్చు. కానీ, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల పేమెంట్స్ కోసం మాత్రమే యూపీఐ అనుసంధానమైన క్రెడిట్ కార్డు వాడవచ్చు. డెబిట్ కార్డుతో మాదిరిగా ఇతర బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు.
యూపీఐ పేమెంట్స్‌కు క్రెడిట్ కార్డు వాడకం అనుమతించడంతో ఆయా కార్డులు వాడే వారికి యూపీఐ సేవలు దగ్గరైనట్లే. కానీ క్రెడిట్ కార్డు వాడకం అంటేనే స్వల్ప కాలిక రుణం తీసుకున్నట్లన్న సంగతి మరవద్దు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా నుంచి అప్పటికప్పుడు డెబిట్ కాదు కానీ, నిర్ణీత గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లు పే చేయాలి.. అదీ కూడా గడువు నాటికి మనీ సర్దుబాటవుతుందనుకుంటే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ చేయాలి. లేని పక్షంలో మీరు అప్పుల ఊబిలో చిక్కుకునే ముప్పు ఉంది. కేవలం ఎమర్జెన్సీలో మాత్రమే క్రెడిట్ కార్డు వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక వేత్తలు తెలిపారు. అప్పుడు మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా యూపీఐ పేమెంట్స్, వాటికి క్రెడిట్ కార్డు అనుసంధానం వల్ల బెనిఫిట్ చేకూరుతుందని నిపుణులు అంటున్నారు.