Hormuz Strait | ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. హర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ సైతం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ప్రపంచంలో చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి కీలకం. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 30శాతం ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. భారత్ చమురు దిగుమతులకు సైతం హర్మూజ్ జలసంధి కీలకమే. ఇది పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. ఇరుకైన ప్రదేశంలో దాదాపు 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఇరుకైన ఛానల్, ఇరాన్ (ఉత్తరం)ను అరేబియా ద్వీపకల్పం (దక్షిణం) నుంచి వేరు చేస్తుంది.
ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ దాదాపు రెండుకోట్ల బ్యారెల్స్ చమురు వివిధ దేశాలకు వెళ్తుంటుంది. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ నుంచి జలసంధి ద్వారా ఎగుమతి అవుతుంది. కూడ్రాయిల్తో పాటు గ్యాస్ రవాణాకు సైతం ఈ జలసంధి కీలకం. మూడింట ఒక వంతు గ్యాస్ సైతం ఈ మార్గం నుంచే పలు దేశాలకు వెళ్తుంది. చమురు రవాణాకు ఎంతో ముఖ్యమైన జలసంధిని మూసివేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు అంచనా. భారత్ తన అవసరాల్లో 90శాతం ముడి చమురును వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో 40శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ దేశాల నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతు చేస్తుంటుంది.
చమురుతో వచ్చే నౌకలు ఒమన్, ఇరాన్ సముద్రమార్గంలో ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తూ దేశానికి చేరుకుంటాయి. మరో వైపు ప్రపంచదేశాలు వినియోగించే గ్యాస్‌లో 20శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. క్రూడాయిల్, గ్యాస్ నౌకలన్నీ ఈ జలసంధి ద్వారానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్‌పై ప్రభావం పడే అవకాశాలున్నా.. రష్యా, అమెరికా, బ్రెజిల్ ద్వారా దిగుమతి చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని పరిశ్రమ విశ్లేషకులు తెలిపారు. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రూడాయిల్ ప్రస్తుతం బ్యారెల్‌కు 74డాలర్లకుపైగా ఉండగా.. బ్రెంట్ 77.27 డాలర్లు పలుకుతున్నది.