Equities in 2021 | కరోనా రెండో వేవ్ ఉధృతి వెంటాడినా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు సంపన్నులయ్యారు. 2021లో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.78 లక్షల కోట్లు పెరిగింది. ఈ ఏడాది చివరి రోజు (శుక్రవారం) ట్రేడింగ్‌తో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 10,502.49 (21.99 %) పాయింట్ల లబ్ధితో ముగిసింది. 2020 మార్చిలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు స్టాక్‌మార్కెట్లు అనునిత్యం కుదేలయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా సెన్సెక్స్ బుల్ పరుగులు తీసింది. 50వేల మార్క్ నుంచి 62 వేల పాయింట్ల స్థాయికి దూసుకెళ్లింది. 2021లో మూడు నెలలు నష్టాలు చవి చూసిన స్క్రిప్ట్‌లకు మిగతా 9 నెలల లాభాల పంట పండింది. కేవలం ఆగస్టులో 4,965.55 పాయింట్లు (9.44%) లబ్ధి పొందిన సెన్సెక్స్.. అక్టోబర్ 19న 62,245.43 పాయింట్ల ఆల్‌టైం రికార్డులు నెలకొల్పింది. నాటి నుంచి సెన్సెక్స్ ఆరు శాతం నష్టపోయింది.
గత 12 నెలల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77,96,692.95 కోట్లు పెరిగి రూ.2,66,00,211.55 కోట్లకు చేరుకున్నది. అక్టోబర్ 19న ఇన్వెస్టర్ల నోషనల్ వెల్త్ 2,74,69,606.93 కోట్లకు పెరిగి ఆల్ టైం రికార్డులు నెలకొల్పింది. 2021లో కరోనా నుంచి ప్రపంచ దేశాలు కోలుకున్నా.. మార్చిలో సెకండ్ వేవ్ దూసుకొచ్చింది. అక్టోబర్ వరకు క్రమంగా పెరుగుతూ వచ్చిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తర్వాత కరెక్షన్కు గురైంది.
టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,01,382.07 కోట్లు, టీసీఎస్ రూ.13,82,280.01 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 8,20,164.27 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.7,94,714.60 కోట్లు, హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ. 5,54,444.80 కోట్లకు చేరింది. చివరి రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 459.50 పాయింట్ల లబ్ధితో 58,253.82 పాయింట్ల వద్ద ముగిసింది. 2020లోనూ సెన్సెక్స్ 15.7 శాతం లాభ పడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2020లో రూ.32,49,689.56 కోట్లు పెరిగి రూ.1,88,03,518.60 కోట్ల వద్ద స్థిర పడింది.