హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కార్యక్రమం మొదలైంది. స్టార్టప్ కేంద్రంగా ఉన్న టీ-హబ్ ఆధ్వర్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రత్యేక షెడ్యూల్నూ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను గురువారం టీ-హబ్ ఇన్నోవేషన్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా గ్రామీణ ఆవిష్కరణలపై దృష్టిపెట్టేలా ‘ఇన్నోవేట్ తెలంగాణ’ను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా ఆలోచిస్తూ, ఏదైనా ఆవిష్కరణ చేయాలనుకుంటున్నవారిని గుర్తించి, వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.
గ్రామీణ స్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇందులో గుర్తించిన నూతన ఆలోచనలకు టీ-హబ్లో ఇంక్యుబేషన్ సదుపాయాన్ని కల్పించడమేగాక, విలువైన భాగస్వాములతో సమావేశాలు, పెట్టుబడులకు వీలుగా ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖాముఖి పరిచయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపిక చేసిన ఆవిష్కరణలకు గ్రాంట్ రూపంలో రూ.2 లక్షలను అందజేస్తామనీ ప్రకటించారు. జిల్లా స్థాయిలోనే జరిగే ఈ ప్రక్రియలో టాప్ 10 స్టార్టప్లకు టీ-హబ్ ద్వారా సహకారం అందుతుందన్నారు.