న్యూఢిల్లీ, జనవరి 12: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఫలితాల్ని ప్రకటించింది. పశ్చిమ దేశాలు మాంద్యంలో చిక్కుకుంటాయన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కంపెనీ భవిష్యత్ ఆదాయ అంచనాల్ని కూడా పెంచి ఆశ్చర్యపర్చింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం వృద్ధిచెంది రూ. 6,586 కోట్లకు చేరగా, ఆదాయం 20.2 శాతం వృద్ధితో రూ. 38,318 కోట్లకు పెరిగింది.
2022 సెప్టెంబర్ త్రైమాసికంతో (రూ.6,021 కోట్లు) పోలిస్తే నికరలాభం 9.3 శాతం పెరగడం గమనార్హం మెజారిటీ బ్రోకరేజ్ సంస్థలు రూ.37,900 కోట్ల ఆదాయంపై రూ. 6,530 కోట్ల నికరలాభం ఆర్జించవచ్చని అంచనా వేశాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ గైడెన్స్‌ను పెంచింది. తమ ఆదాయం 16-16.5 శాతం పెరుగుతుందంటూ వెల్లడించింది. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఇచ్చిన గైడెన్స్ 15-16 శాతమే.
నికర నియామకాలు 1,627
ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కొత్తగా 1,627 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,46,845కు చేరింది.