Infosys in Russia | ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాపై అమెరికా.. దాని మిత్ర దేశాలు ఆంక్షలు విధించాయి. పలు విదేశీ సంస్థలు రష్యాతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాయి. కానీ అమెరికా మిత్రదేశం.. బ్రిటన్ ఆర్థిక మంత్రి.. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు మాత్రం ఇబ్బందులొచ్చి పడ్డాయి. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పటికీ రష్యాలో సేవలందిస్తున్నది. రష్యాలో ఇన్ఫోసిస్ సేవలకు.. రిషి సునాక్‌కు సంబంధం ఏమిటంటారా.. అవును ఇన్ఫీతో సునాక్‌కు అనుబంధం ఉంది.. ఆయన సతీమణి స్వయాన ఇన్ఫోసిస్ సహావ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తనయ అక్షత మూర్తి. ఆమెకు ఇన్ఫీలో షేర్లు కూడా ఉన్నాయి. ఇదే ప్రశ్న సునాక్ రిషిని మీడియా ప్రశ్నించింది. రష్యాలో ఇన్ఫీ సేవలు అందించడమేమిటని నిలదీసింది. ఓ బ్రిటిష్ టీవీ చానెల్ స్కై న్యూస్ ఇంటర్వ్యూలో రిషి సునాక్ పాల్గొన్నారు.
ఇతర సంస్థలు రష్యాతో సంబంధాలు తెంచుకుంటే ఇన్ఫోసిస్ ఎందుకు లావాదేవీలు నిర్వహిస్తున్నదని సునాక్ రిషిని స్కై న్యూస్ చానెల్ యాంకర్ ప్రశ్నించారు. బ్రిటన్ సర్కార్ విధించిన ఆంక్షలు మీకు వర్తించవా? అని నిలదీసినంత పని చేశారు. దీనిపై స్పందించడానికి సునాక్ రిషి తడబడ్డారు. తానేమీ ఇన్ఫోసిస్‌లో భాగం కాదని చెప్పుకొచ్చారు. ఇన్ఫోసిస్‌లో వాటాలు ఉన్నా, తన భార్య అక్షత మూర్తి స్వతంత్రురాలని, బ్రిటన్ ఎంపీ కాదని సునాక్ వివరణ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ వ్యాపార లావాదేవీలకు తాను బాధ్యత వహించలేనన్నారు రిషి సునాక్. బ్రిటన్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా మాట్లాడేందుకు వచ్చానని తెలిపారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్‌కు తాను వారసుడినన్నారు. సునాక్ భార్య అక్షత ఎంపీ కాకున్నా.. ఉక్రెయిన్‌కు బ్రిటన్ సాయం చేస్తున్న వేళ.. రష్యా నుంచి ఆయన కుటుంబం లాభాలు పొందడం సరైనదేనా అని న్యూస్ చానెల్ ప్రశ్నించింది. కానీ కంపెనీల లావాదేవీలు వాటి యాజమాన్యాలపై ఆధారపడి ఉంటాయన్నారు. తమ ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమలు చేయాల్సిన బాధ్యత కంపెనీలదేనన్నారు. ఇన్ఫోసిస్ విషయంలో తాను చేసేదేమీ లేదన్నారు.
రష్యాలో సేవలపై ఇన్ఫోసిస్ స్పందించింది. అక్కడ చిన్న టీం మాత్రమే పని చేస్తున్నదని గ్లోబల్ క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ఉక్రెయిన్ బాధితుల కోసం 10 కోట్ల డాలర్ల సహాయ నిధి ప్రకటించామని పేర్కొంది. రష్యా స్థానిక సంస్థలతో ఎటువంటి బిజినెస్ సంబంధాల్లేవని వ్యాఖ్యానించింది. ఇన్ఫోసిస్‌లో దాని సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తికి 100 కోట్ల డాలర్ల విలువ గల షేర్లు ఉన్నాయి.