IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) పేరెంట్ సంస్థ ‘ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Interglobe Aviation Limited) నుంచి సంస్థ కో-ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబ సభ్యులు తమ వాటాలను విక్రయించారు. సంస్థలో వాటాలో కొంత భాగం రూ.7500 కోట్లకు విక్రయించారు. క్రమంగా ఇండిగో నుంచి రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబం తప్పుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
వచ్చే నెల 15 నాటికి లాకిన్ పీరియడ్ ముగిసేలోగా.. బ్లాక్ డీల్స్ ద్వారా మరో ఎనిమిది శాతం వాటా గంగ్వాల్ కుటుంబం విక్రయిస్తుందని తెలుస్తున్నది. ఇప్పటికే రాకేశ్ గంగ్వాల్ భార్య శోభా గంగ్వాల్ తన నాలుగు శాతం వాటాను గత ఫిబ్రవరిలోనే విక్రయించారు. సంస్థ నుంచి తాను వైదొలిగే ఐదేండ్ల లోపు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ నుంచి తప్పుకుంటానని ఇంతకుముందే రాకేశ్ గంగ్వాల్ ప్రకటించారు.
ఇండిగో కో-ఫౌండర్లు రాకేశ్ గంగ్వాల్, రాహుల్ భాటియా మధ్య వివాదం తలెత్తినప్పటి నుంచి సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నది. ఇప్పటికే గో-ఫస్ట్ స్వచ్ఛంద దివాళా పరిష్కారానికి పిటిషన్ దాఖలు చేసింది. ఇంజిన్ల కొరత కారణంగా పలు ఇండిగో విమానాలు సైతం నేలకు పరిమితం అయ్యాయి. కానీ, దేశీయ విమానయాన రంగంలో ఇండిగో 50 శాతం వాటా కలిగి ఉండటమే దీనికి సానుకూల అంశంగా ఉందని తెలుస్తున్నది.