Direct Tax Collections | గత ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల్లో 21 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 17 వరకూ రూ.4.62 లక్షల కోట్లపై చిలుకు పన్నులు వసూలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 17 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4,62,664 కోట్లకు చేరాయి. వాటిల్లో కార్పొరేట్ ఇన్ కం టాక్స్ (సీఐటీ) రూ.1,80,949 కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్తోపాటు వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.2,81,013 కోట్లు వసూలయ్యాయని సీబీడీటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 2024-25లో ఈ నెల 17 వరకూ రూ.53,322 కోట్ల రీఫండ్స్ జరిగాయని తెలిపింది. 2023-24తో పోలిస్తే 34 శాతం ఎక్కువ అని వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ 17వ తేదీ నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.16 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే టైంలో రూ.4.23 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2023-24తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22.19 శాతం వృద్ధిరేటు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.21.99 లక్షల కోట్లు ఉంటుందని బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది.