Forex Reserve | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు వరుసగా రెండో వారం పుంజుకున్నాయి. ఈ నెల 10తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 2.561 బిలియన్ డాలర్లు పెరిగి 644.151 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల మూడో తేదీకి ముందు మూడు వారాలు వరుసగా పడిపోయిన ఫారెక్స్ రిజర్వు నిల్వలు తిరిగి పుంజుకున్నాయి. ఈ నెల మూడో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 3.668 బిలియన్ డాలర్లు పెరిగి 641.59 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత నెల ఐదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 648.562 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 10తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ ఆస్తులు 1.488 బిలియన్ డాలర్లు పెరిగి 565.648 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. బంగారం రిజర్వు నిల్వలు 1.072 బిలియన్ డాలర్లు పెరిగి 55.952 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా ఐదు మిలియన్ డాలర్లు పెరిగి 18.056 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు మాత్రం నాలుగు మిలియన్ డాలర్లు పతనమై 4.495 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.