Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నెల పదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 8.714 బిలియన్ డాలర్లు పతనమై 625.871 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల మూడో తేదీతో ముగిసిన వారంలోనూ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 5.693 బిలియన్ డాలర్లు పతనమై 634.585 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. గత కొన్ని వారాలుగా ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తగ్గుతూ వస్తున్నయి. అంతర్జాతీయంగా ఫారెక్స్ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు రూపాయి విలువ పతనం కాకుండా ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లు విక్రయిస్తున్నది. 2024 సెప్టెంబర్ నెలాఖరులో ఫారెక్స్ రిజర్వు నిల్వలు రూ.704.885 బిలియన్ డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకాయి.
ఈ నెల పదో తేదీతో ముగిసిన వారానికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ 9.469 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 536.011 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బంగారం రిజర్వు నిల్వలు 792 మిలియన్ డాలర్లు క్షీణించి 67.883 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్).. 33 మిలియన్ డాలర్లు పడిపోయి 17.781 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4 మిలియన్ డాలర్లు పతనమై 4.195 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది.