ముంబై, అక్టోబర్ 6: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా నాలుగో వారమూ తగ్గి ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.. సెప్టెంబర్ 29తో ముగిసిన వారంలో ఇవి భారీగా 3.8 బిలియన్ డాలర్ల మేర తగ్గి 586.91 బిలియన్ డాలర్ల స్థాయికి క్షీణించినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
అంతక్రితం వరుస మూడు వారాల్లో ఇవి 8.2 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. రూపాయి పతనాన్ని నిరోధించేందుకు రిజర్వ్‌బ్యాంక్ ఫారెక్స్ స్పాట్, ఫార్వర్డ్ మార్కెట్లలో డాలర్లను విక్రయించడంతో నిల్వల్లో తరుగుదల ఏర్పడిందని ట్రేడర్లు తెలిపారు. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత మళ్లీ ఆ స్థాయికి నిల్వలు కోలుకోలేదు.
సెప్టెంబర్ 29తో ముగిసిన వారంలో విదేశీ నిల్వల్లో అధికభాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఏకంగా 3.13 బిలియన్ డాలర్లు తగ్గి 520.24 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ మారకంలో వెల్లడించే విదేశీ కరెన్సీ ఆస్తుల్లో..అమెరికాయేతర కరెన్సీలయిన యూరో, పౌండ్, యెన్ల విలువల్లో ఏర్పడిన పెరుగుదల లేదా తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు.
సమీక్షా వారంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న బంగారం నిల్వలు సైతం తరిగిపోయాయి. ఇవి 576 మిలియన్ డాలర్ల మేర క్షీణించి 43.73 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 74 మిలియన్ డాలర్లు తగ్గుదలతో 17.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద ఉంచిన రిజర్వుల విలువ 18 మిలియన్ డాలర్లు తగ్గి 5 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.