న్యూఢిల్లీ, జూలై 7: దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. మే నెలలో ఏకంగా దేశీయ విమానయాన సంస్థలు 1.53 కోట్ల మంది విమాన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. ఏప్రిల్ నెలలో ప్రయాణించిన 1.38 కోట్ల కంటే ఇది 11 శాతం అధికమని విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో 64.9 శాతం మార్కెట్ వాటాతో తొలిస్థానాన్ని పదిలపరుచుకున్నది. ఆ తర్వాత స్థానంలో ఎయిర్ ఇండియా 25.6 శాతంతో ఉండగా, ఆకాశ ఎయిర్ 5.8 శాతంతో, స్పైస్‌జెట్ 2.5 శాతం మార్కెట్ వాటా కలిగివున్నాయి.
జనవరి నుంచి మే మధ్యకాలంలో 7.29 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా, అంతక్రితం ఏడాది ప్రయాణించిన 7.15 కోట్లతో పోలిస్తే రెండంకెల వృద్ధి నమోదైంది. సరైనా సమయానికి విమాన సర్వీసులు నడిపే సంస్థల్లో ఇండిగో 82.8 శాతంతో తొలిస్థానంలో నిలువగా, ఆకాశ ఎయిర్ 78.3 శాతం, ఎయిర్ ఇండియా 74.5 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. విమాన సర్వీసులు రద్దుకావడంతో 63 వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకోసం ఆయా విమానయాన సంస్థలు రూ.70.32 లక్షల పరిహార చెల్లింపులు జరిపారు.