ముంబై, జూలై 22 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దూసుకుపోతుండటంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు బుధవారం కూడా ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. వీటికి తోడు బ్యాంకింగ్ రంగ షేర్లు ఒత్తిడికి గురికావడం కూడా పతనానికి ఆజ్యంపోసినట్టు అయింది. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 715.06 పాయింట్లు కోల్పోయి 76,755.05 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ కూడా 191.45 పాయింట్లు నష్టపోయి 23,996.25 వద్ద స్థిరపడింది.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతుండటం, కీలక ప్రపంచ నౌకా రవాణా మార్గాలకు హౌతీలు తీవ్ర అంతరాయాలు కల్గిస్తుండటంతో చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుండటంతో ఇంధన ధరలు రెక్కలు రావడం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వీటికి కూడా దేశీయ కరెన్సీ విలువ మరింత బలహీనపడటం కూడా పతనాన్ని మరింత పెంచిందన్నారు. సూచీల్లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా రియల్టీ సూచీ అత్యధికంగా 2.62 శాతం బలపడగా, సర్వీసెస్ 1.97 శాతం, పీఎస్‌యూ బ్యాంకింగ్ 1.83 శాతం, ఫోకస్డ్ ఐటీ 1.73 శాతం, మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంకింగ్ 1.63 శాతం, ఐటీ 1.47 శాతం పతనం చెందాయి.