Indian Oil EV Stations | విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. దేశంలోకెల్లా అతిపెద్ద ముడి చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 1000 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వెయ్యి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రివల్యూషన్ దిశగా తొలి లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని తెలిపింది. వచ్చే మూడేండ్లలో దేశవ్యాప్తంగా 10వేల పెట్రోల్ బంకుల వద్ద విద్యుత్ చార్జింగ్ ఫెసిలిటీస్ అందుబాటులోకి తెస్తామని ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ వీ సతీశ్ కుమార్ తెలిపారు.
విద్యుత్ వాహనాల తయారీలో ఆటోమొబైల్ తయారీ దారులకు సహకరించడంతోపాటు కస్టమర్లలో విశ్వాసం కల్పించడానికి ఈ విద్యుత్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పలు రాష్ట్రాలు, జాతీయ రహదారుల మధ్య 500 పట్టణాల పరిధిలో ఇండియన్ ఆయిల్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంది.
వచ్చే మూడేళ్లలో జాతీయ రహదారులను ఈ-జాతీయ రహదారులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియన్ ఆయిల్ తెలిపింది. ఇందుకోసం 3000కి పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి టాటా పవర్, ఆర్ఈఐఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ, ఫోర్టమ్, హ్యుండాయ్, టెక్ మహీంద్రా భెల్, ఓలా తదితర సంస్థలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది.