IOC Matrimonial | పెండ్లంటే ఏడడుగులు.. నూరేళ్ల పంట.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలక మలుపు. గతంలో పెండ్లిళ్ల పేరయ్యలు సంబంధాలు కుదిర్చేవారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక మ్యాట్రిమోనీలు వచ్చాయి. మ్యాట్రిమోనీ పోర్టల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యాప్‌లు వచ్చేశాయి. మన పిల్లలకు అవసరమైన జీవిత భాగస్వాములను వెతుక్కోవాలంటే ఆయా యాప్‌ల్లో పేర్లు రిజిస్టర్ చేస్తే సరి.. ఆ బాటలోకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వచ్చి చేరింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను ఒక ఇంటి వారిని చేరేందుకు కంకణం కట్టుకున్నది. కొత్తగా గత జనవరిలో మ్యాట్రిమోనీ పోర్టల్ ప్రారంభించింది. ఐఓసీయాన్స్2గెదర్ (IOCians2gether) అనే పేరుతో ఈ పోర్టల్ సేవలు అందించనున్నది. ఈ మ్యాట్రిమోనీ ద్వారా ఐవోసీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గతనెల 24న నూతన దంపతులయ్యారు.
కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సీమా యాదవ్, తరుణ్ బన్సాల్ తొలిసారి ఐఓసీయాన్స్2గెదర్ (IOCians2gether) వేదిక ద్వారా దంపతులయ్యారు. గత నెల 24న జరిగిన ఈ వేడుకకు ఐవోసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ మాధవ్ వైద్య హాజరయ్యారు. సీమా యాదవ్, తరుణ్ బన్సాల్ వివాహ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను పలువురు లైక్ చేశారు. తరుణ్-సీమ ఒక్కటైనందుకు తనకు థ్రిల్లింగ్‌గా ఉందని శ్రీకాంత్ మాధవ్ వైద్య అన్నారు. `మా పోర్టల్ `ఐఓసీయాన్స్2గెదర్` ద్వారా దంపతులైన తొలి జంట ఇది. మీ వైవాహిక జీవితం అంతా సంతోషంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా` అని పేర్కొన్నారు.
గత ఐదేండ్లుగా సీమా, తరుణ్‌లు.. ఐఓసీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పని చేస్తున్నారు. ఐవోసీ మ్యాట్రిమోనీ పోర్టల్ ప్రారంభించగానే వారిద్దరూ కలుసుకున్నారు. ఆ మరుసటి నెలలోనే పెండ్లి చేసుకున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ముందే ఈ దంపతులు పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఉండొచ్చునని పోస్ట్‌లు పెడుతున్నారు.