Budget 2025 | న్యూఢిల్లీ, జనవరి 29: ఈసారి బడ్జెట్లో పన్ను నిర్మాణాల సరళతరంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని భారతీయ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ కోరుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో స్పష్టమైన రెగ్యులేటరీ నిబంధనలు తేవాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే డిజిటల్ ఆస్తుల రంగంలో బలమైన వృద్ధికి వీలుంటుందని చెప్తున్నారు.
ప్రస్తుతం భారతీయ క్రిప్టో మార్కెట్.. అదృశ్య కరెన్సీ ఆస్తుల నుంచి వచ్చే మూలధన లాభాల (క్యాపిటల్ గెయిన్స్)పై 30 శాతం పన్నును ఎదుర్కొంటోంది. అలాగే అన్ని క్రిప్టో లావాదేవీలపై 1 శాతం ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)ను చెల్లించాల్సి వస్తున్నది. దీంతో టీడీఎస్‌ను 0.01 శాతానికి పరిమితం చేయాలని, తద్వారా విదేశీ ఎక్సేంజీలకు ఇక్కడి నుంచి తరలిపోయే మూలధనం తగ్గుతుందని ఇండస్ట్రీ చెప్తున్నది.
కాగా, క్రిప్టో ఆస్తుల కోసం ఓ పక్కా లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని కూడా ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో ఆ దిశగా ఓ నిర్ణయం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక బ్లాక్‌చైన్, వెబ్3 స్టార్టప్‌లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలుంటే భారీగా పెట్టుబడులు రావచ్చన్న అంచనాలున్నాయి.
ఎస్ఎంఈలకు బడ్జెట్లో చేయూతనివ్వాలని ఆ కంపెనీలు కోరుతున్నాయి. ఏఐ తదితర టెక్నాలజీలను అందిపుచ్చుకునేలా పన్ను ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తయారీ జోన్లు, క్రెడిట్ గ్యారంటీ స్కీములు అవసరమని చెప్తున్నారు.