BSE-Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.414.75 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. ఈ మార్కును దాటడం ఇదే తొలిసారి. జూన్ నాలుగో తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్స్ విక్రయిస్తున్నా దేశీయ ఇన్వెస్టర్ల నుంచి స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది.
2023 నవంబర్ 29 నాటికి బీఎస్ఈ లిస్టె్డ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును దాటింది. కేవలం ఆరు నెలల్లోపే బీఎస్ఈ ఎం-క్యాప్ లక్ష కోట్ల డాలర్లు పుంజుకోవడం గమనార్హం. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఆల్ టైం గరిష్టానికి 250 పాయింట్ల దూరంలో నిలిచింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్సులు కొత్త గరిష్టాలకు దూసుకెళ్లాయి.
దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, అత్యంత సంపన్నుల (హెచ్ఎన్ఐఎస్) మద్దతుతో స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీసింది. ఈ నెలలో దలాల్ స్ట్రీట్ నుంచి రూ.28 వేల కోట్ల లోపు విలువైన స్టాక్స్‌ను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు విక్రయించారు.
మెటల్, పవర్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించింది. ఎనిమిది సెషన్లలో బీఎస్ఈలో ర్యాలీ కొనసాగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.21.27 లక్షల కోట్లు పెరిగింది. గత మార్చి 13 నుంచి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.372.17 లక్షల కోట్ల నుంచి రూ.42.46 లక్షల కోట్లు పెరిగింది.
మంగళవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 73,842.96 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైంది. అంతర్గత ట్రేడింగ్‌లో 74,189.19 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి 73,762.37 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 52.63 పాయింట్లు కోల్పోయి 73,953.31 పాయింట్ల వద్ద నిలిచింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 27.05 పాయింట్ల లబ్ధితో 22,529.05 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ 83.31 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ లబ్ధి పొందగా, నెస్లే ఇండియా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.