హైదరాబాద్, డిసెంబర్ 22: దేశంలో ‘యూనీకార్న్’ హోదాకు ఎదుగుతున్న స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 33 యూనీకార్న్లు అయ్యాయి. దీంతో యూనీకార్న్ల మొత్తం సంఖ్యలో బ్రిటన్ స్థానాన్ని భారత్ ఆక్రమించి, ప్రపంచంలో తృతీయస్థానానికి చేరింది. 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) విలువను చేరిన స్టార్టప్‌ను యూనీకార్న్గా వ్యవహరిస్తారు. హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బుధవారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 54 యూనీకార్న్లు ఉండగా, బ్రిటన్‌లో వాటి సంఖ్య 39కు పరిమితమయ్యింది. బ్రిటన్‌లో ఈ ఏడాది 15 యూనీకార్న్లుగా ఎదిగాయి. ప్రధమస్థానంలో ఉన్న అమెరికాలో ఈ సంవత్సరం కొత్తగా 254 సంస్థలు ఈ హోదాను సంపాదించడంతో అక్కడ యూనీకార్న్ల సంఖ్య 487కు పెరిగింది. 301 యూనీకార్న్లతో చైనా ద్వితీయస్థానంలో ఉంది. ఈ దేశంలో 2021లో నూతనంగా 74 సంస్థలు యూనీకార్న్ హోదాలోకి వచ్చాయి. యూనీకార్న్ ప్రపంచంలో 74 శాతం అమెరికా, చైనాల్లోనే ఉన్నాయి.
భారత్‌లో యూనీకార్న్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు విదేశాల్లో ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో భారతీయులు నెలకొల్పిన స్టార్టప్‌ల్లో ఈ సంవత్సరం 65 సంస్థలు 1 బిలియన్ డాలర్ల మించిన విలువను సాధించాయని హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రహ్మాన్ చెప్పారు. ఇక ఇండియాలోని యూనీకార్న్ల విషయానికొస్తే 21 బిలియన్ డాలర్ల విలువతో ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ తర్వాతి స్థానాల్లో ఇన్‌మొబి (12 బిలియన్ డాలర్లు), ఓయో (9.5 బిలియన్ డాలర్లు), రేజర్‌పే (7.5 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.