న్యూఢిల్లీ, మార్చి 11: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిచేసే మహిళా ఇన్వెస్టర్లు క్రమేపీ పెరుగుతున్నారు. ఫండ్స్ ఫోలియోల్లో 2017 మార్చిలో 15 శాతం ఉన్న మహిళల వాటా 2023 డిసెంబర్‌కల్లా 21 శాతానికి చేరినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షల కోట్ల మార్క్‌ను దాటిన సంగతి తెలిసిందే.
పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు తమ పొదుపును ఫండ్స్‌లోకి మళ్లించడం ఇందుకు కారణమని, ఇందులో నగర ప్రాంతాల్లోని మహిళా ఫోలియోలు 17 శాతం నుంచి 28 శాతానికి పెరగ్గా, పట్టణ మహిళల వాటా 15 శాతం నుంచి 18 శాతానికి చేరినట్టు యాంఫి డాటా ఆధారంగా క్రిసిల్ తయారుచేసిన నివేదిక తెలిపింది. మొత్తం మహిళా ఇన్వెస్టర్లలో 25-44 వయస్సుగలవారు 50 శాతం ఉన్నారన్నది. ఇదే సమయంలో మహిళా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య 42,000 మార్క్‌ను సమీపిస్తున్నదని, ఈ డిస్ట్రిబ్యూటర్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ. 1 లక్ష కోట్లకు చేరిందని క్రిసిల్ వివరించింది.