హైదరాబాద్, జూన్ 5: ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్‌కు పెరుగుతున్న డిమాండ్.. ఇక్కడి అభివృద్ధికి అద్దం పడుతున్నది. దేశీయ కార్పొరేట్ రంగంలో బెంగళూరు ఆధిపత్యాన్ని అధిగమించి కొత్త కార్యాలయాల సరఫరాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీ అనరాక్ తాజా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2022-23) హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్ స్పేస్ 14.94 మిలియన్ చదరపు అడుగులు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే ఇది 27 శాతం ఎక్కువ అవగా, హైదరాబాద్‌సహా దేశంలోని టాప్-7 నగరాల్లోని కొత్త ఆఫీస్ స్పేస్‌లో 31 శాతానికి సమానం కావడం గమనార్హం.
వెనుకబడ్డ బెంగళూరు
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో బెంగళూరుకున్న ఆదరణ పడిపోతున్నది. 2022-23లో పూర్తయిన ఆఫీస్ స్పేస్ 12.66 మిలియన్ చదరపు అడుగులే. 2021-22తో పోల్చితే ఇది 13 శాతం తక్కువ. అలాగే టాప్-7 నగరాల్లోని స్పేస్‌లో 26%తో సమానం. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్ల్లోనూ డిమాండ్ అంతంతమాత్రంగానే కనిపించింది.
పెరిగిన ఆఫీసు అద్దెలు
గత ఆర్థిక సంవత్సరం ఆఫీసు అద్దెలు పెరిగాయి. హైదరాబాద్‌సహా దేశంలోని టాప్-7 నగరాల్లో ఆఫీస్ రెంటల్స్ 4 శాతం ఎగిసినట్టు అనరాక్ స్పష్టం చేసింది. 2022-23లో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ల సగటు అద్దె నెలకు చదరపు అడుగుకు రూ.79గా ఉన్నది. నిర్మాణ, తదితర ఖర్చులు పెరగడం వల్లే అద్దెల్ని పెంచుతున్నారని కూడా అనరాక్ వెల్లడించింది.