న్యూఢిల్లీ, అక్టోబర్ 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలోనూ భగ్గుమన్నది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్ఠానికి చేరుతూ 7.4 శాతానికి ఎగిసింది. అంతకుముందు నెల ఆగస్టులో 7 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. నిరుడు సెప్టెంబర్లో మాత్రం 4.35 శాతంగానే ఉన్నది. కాగా, ఈ ఏడాది మొదలు ధరలు పెరుగుతూపోతూనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదయోగ్య స్థాయి 6 శాతాన్ని దాటి రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదు కావడం ఇది వరుసగా 9వ నెలగా రికార్డులకెక్కింది.
ఆహార ధరలతోనే సమస్య
రిటైల్ ద్రవ్యోల్బణం పరుగులు పెట్టడానికి ప్రధాన కారణం ఎంతకీ తగ్గని ఆహారోత్పత్తుల ధరలే. ఈ సెప్టెంబర్ ద్రవ్యోల్బణం గణాంకాల్లోనూ ఆహార ద్రవ్యోల్బణం వాటా 8.6 శాతానికి ఎగబాకింది. అంతకుముందు నెల ఆగస్టులో 7.62 శాతంగానే ఉన్నది. కేవలం నెల రోజుల్లో దాదాపు 1 శాతం పెరగడం ఇప్పుడు ఆందోళనకరంగా తయారైంది. మార్కెట్లో పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, చేప లు, మాంసం, పండ్లు, పాల ఉత్పత్తులు.. ఇలా అన్నింటి ధరలు సామాన్యులకు అందనంత స్థాయిలోనే కదలాడుతున్నాయి మరి. ఉత్పాదక, రవాణా వ్యయాలు ధరలు దిగిరాకుండా ప్రధానంగా అడ్డుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధన ధరలు అధికం గా ఉండటం కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫలించని ఆర్బీఐ చర్యలు
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచుతూపోతున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రెపోరేటును రికార్డు స్థాయిలో తగ్గించిన ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయికి చేరడంతో అంతే వేగంగా పెంచుతూపోతున్నది చూస్తూనే ఉన్నాం. గడిచిన కొన్ని ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును 1.9 శాతం పెంచింది. దీంతో బ్యాంకులన్నీ తమ రుణాలపై వడ్డీరేట్లనూ ఇంతేస్థాయిలో పెంచేశాయి. ఫలితంగా గృహ, వాహన తదితర రుణాలన్నీ భారమవగా, ఆయా రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇంత జరిగినా ద్రవ్యోల్బణం మాత్రం ఆగకపోవడం.. ఆర్బీఐ విధానాలనే విమర్శలపాలు చేస్తున్నది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం మధ్యే ఉండాలని ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో వైఫల్యానికి గల కారణాలను సర్కారుకు ఆర్బీఐ నివేదించుకోవాల్సి వస్తున్నది.