IT Returns on Gifts | వేతన జీవి మొదలు చిన్న వ్యాపారి, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. ఈ నెల 18 నాటికి మూడు కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. ఇప్పటి వరకూ మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదా.. అయితే, వెంటనే ఆ పని పూర్తి చేసేయండి..
ఐటీ రిటర్న్స్ ఫైల్ దాఖలు చేసే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటిల్లో మీకు వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులు కూడా ఉండాలి. ప్రత్యేకించి దీపావళి, బర్త్ డే, వివాహ వార్షికోత్సవం.. ఇతర శుభకార్యాల్లో బంధువులు గానీ, మిత్రులు గానీ బహుమతులు ఇస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు మీకు వచ్చిన బహుమతుల సమాచారం ఇవ్వడం మరిచిపోయారా.. ఐటీ విభాగం నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. కనుక ఆయా బహుమతులపై ఐటీ రిటర్న్స్ గురించి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నవీన్ పోతుల ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. !
ఆదాయం పన్ను నిబంధనల ప్రకారం మీరు రూ.50 వేలకంటే ఎక్కువ విలువ గల బహుమతులు అందుకుంటే.. దానిపై పన్ను పే చేయాల్సి ఉంటుంది. ఏదేనీ ఒక్క బహుమతిపై ఇన్ కం టాక్స్ విధించరు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకునే బహుమతులపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
దీపావళి, ఇతర సందర్భాల్లో వచ్చే బహమతులను ఇతర ఆదాయ మార్గాల కింద వర్గీకరిస్తారు. ఇది మీ స్థూల ఆదాయంలోకి వస్తుంది. అందుకే మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ముందు ఈ సమాచారం మొత్తం ఇవ్వాలి. మీ ట్యాక్స్ శ్లాబ్ ఆధారంగా పన్ను పే చేయాల్సి ఉంటుంది.
చెక్, నగదు రూపంలో రూ.50 వేలకు పైగా బహుమతి తీసుకుంటే
రూ.50 వేలకు పైగా విలువ గల భవనం, భూమి వంటి స్థిరాస్తి బహుమతిగా అందుకున్నా..
రూ.50 వేలకు పైగా విలువ గల బంగారం ఆభరణాలు, చీరలు, పెయింటింగ్స్, ఇతర విలువైన వస్తువులు బహుమతిగా తీసుకున్నా..
రూ.50 వేల పై చిలుకు ఏ ఆస్తి (స్థిరాస్థి కాకుండా) బహుమతి అందుకున్నా
మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి రక్త సంబంధీకుల నుంచి మీరు బహుమతి అందుకున్నట్లైతే పన్ను చెల్లించనక్కరలేదు. మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి బహుమతి తీసుకున్నా, వారికి బహుమతి ఇచ్చినా పన్ను వర్తించదు.. అవేంటో చూద్దాం..
భార్య లేదా భర్త పరస్పరం బహుమతులు అందుకున్నా, సోదర సోదరీమణులు పరస్పరం బహుమతులు ఇచ్చుకున్నా, తల్లిదండ్రులు, అత్తామామలు, బాబాయిలు, చిన్నమ్మలు, భార్య తోబుట్టువులు, భర్త తోబుట్టువుల నుంచి గిఫ్ట్లు పొందినా పన్ను వర్తించదు.
హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి బహుమతి అందుకున్నా, పూర్వీకుల నుంచి బహుమతి తీసుకున్నా..
పంచాయతీ, లేదా మునిసిపాలిటీ, జిల్లా బోర్డు, కంటోన్మెంట్ బోర్డు నుంచి బహుమతి అందుకున్నా ..
ఏదైనీ ఫండ్, ఫౌండేసన్, యూనివర్సిటీ, విద్యాసంస్థ, హాస్పిటల్ లేదా మెడికల్ సంస్థ, ట్రస్ట్ నుంచి బహుమతి అందుకున్నా ఆదాయం పన్ను చట్టంలోని 10 (23సీ) సెక్షన్ కింద మినహాయింపు.
ఆదాయం పన్ను చట్టంలోని 12 ఏ, 12 ఏఏ సెక్షన్ల కింద రిజిస్టర్ అయిన ఏదైనా చారిటబుల్, అధ్యాత్మిక ట్రస్ట్ బహుమతి అందుకున్నా పన్ను రాయితీ.
యాజమాన్యం నుంచి రూ.5000 లోపు బహుమతి తీసుకుంటే పన్ను ఉండదు. రూ.5000 కంటే ఎక్కువ విలువ గల బహుమతి అందుకుంటే దాన్ని మీ వేతన ఆదాయంగా పరిగణిస్తారు.
వివాహ వేడుక సందర్భంగా అందుకునే బహుమతులపై పన్నుమాఫీ. అయితే, వివాహానికి వచ్చిన బహుమతుల వివరాలు ఐటీఆర్ ఫైలింగ్ లో చేర్చాలి. వాటికి వివాహ ఆహ్వాన పత్రిక, వివాహ మహోత్సవ ఫొటోలు జత చేయాలి.
ఆదాయం పన్ను చట్టం 269 ఎస్టీ సెక్షన్ ప్రకారం రూ.2 లక్షలు, అంత కంటే ఎక్కువ నగదు బహుమతి అందుకున్నా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కనుక బ్యాంకు ద్వారా అంటే ఏ/సీ పే చెక్, ఏ/సీ పే బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా బ్యాంక్ ట్రాన్స్ పర్ ద్వారా బహుమతులు పొందొచ్చు. ఒకవేళ సెల్ఫ్ చెక్ తీసుకున్నా పెనాల్టీ విధిస్తారు.