Real Estate | హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: గతమెంతో ఘనం అన్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తయారైందా? అంటే అవుననే సమాధానమే వస్తున్నదిప్పుడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ శుక్రవారం విడుదల చేసిన అంచనాలను చూస్తే ఇదే అర్థమవుతున్నది మరి. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలపై ప్రాప్‌ఈక్విటీ ఓ రిపోర్టును విడుదల చేసింది.
దీని ప్రకారం 42 శాతం క్షీణతతో హైదరాబాద్ నగరం ముందుండటం గమనార్హం. ఆ తర్వాత బెంగళూరు (26 శాతం), కోల్‌కతా (23 శాతం), పుణె (19 శాతం), చెన్నై (18 శాతం), ముంబై (17 శాతం), థానె (10 శాతం) ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 22 శాతం, నవీ ముంబైలో 4 శాతం చొప్పున పెరిగే వీలున్నట్టు పేర్కొన్నది. కాగా, మొత్తం ఈ 9 నగరాల్లో ఈ జూలై-సెప్టెంబర్‌లో ఇండ్ల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చన్నది. నిరుడు ఇదే వ్యవధిలో 1,26,848 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు పేర్కొన్నది. దీంతో 18 శాతం పతనానికి అవకాశాలున్నట్టు ప్రాప్‌ఈక్విటీ తెలిపింది.
12వేల యూనిట్లకే పరిమితం
హైదరాబాద్‌లో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్‌ఈక్విటీ చెప్తున్నది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయన్నది. దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే అత్యంత క్షీణత నమోదవుతున్నది. గత ఏడాదిదాకా దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. ముంబై, బెంగళూరు వంటి నగరాలనూ దాటుకొని గడిచిన పదేండ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది.
హైడ్రా ఎఫెక్ట్!
తాజా గణాంకాలను చూస్తే.. హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాల తగ్గుదలకు ‘హైడ్రా’ భయాలే కారణమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు అక్రమార్కులు చేసిన పనికి మొత్తం నిర్మాణ రంగమే మందగమనంలోకి వెళ్లిపోయిందని రియల్టర్లు, అనుబంధ రంగాల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ లే-అవుట్లతో అమాయక జనాలు ఆగమైపోయారని, కొత్తగా కొనేందుకూ ఎవరూ ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.
చెరువుల చుట్టుపక్కల్లోనైతే చాలా దూరం వరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, ఇండిపెండెంట్ హౌజ్‌లు, ఓపెన్ ప్లాట్ల జోలికి ఎవరూ వెళ్లడం లేదని, పెట్టిన పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. పరిస్థితులు ఇలాగే సాగితే నిర్మాణ రంగం.. మళ్లీ కరోనా సంక్షోభం నాటి పరిస్థితుల్ని చూడకతప్పదన్న ఆందోళనల్నీ కనబరుస్తున్నారు. నిజానికి దసరా, దీపావళి పండుగల సమయాల్లో హౌజింగ్ సేల్స్ ఊపందుకుంటాయి. కానీ నగరంలో ఆ సంకేతాలేవీ కనిపించట్లేదిప్పుడు.