న్యూఢిల్లీ : సబ్స్క్రైబర్ల సంఖ్య పడిపోతుండటంతో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ మరో 300 మంది ఉద్యోగులను సాగనంపింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఈసారి ఏకంగా నాలుగు శాతం మందిపై స్ట్రీమింగ్ దిగ్గజం వేటు వేసింది. అమెరికన్ మార్కెట్లో పలు వ్యాపార విభాగాల్లోని ఉద్యోగులను అధికంగా తొలగించింది.
దశాబ్ధంలో తొలిసారిగా భారీగా సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో గత నెలలో నెట్‌ఫ్లిక్స్ 150 మంది సిబ్బందిని తొలగించింది. స్ట్రీమింగ్ దిగ్గజం ఎడాపెడా కొలువుల కోతకు దిగుతుండటంతో కంపెనీ షేర్ ధర భారీగా కుదేలైంది. రెవెన్యూ రాబడి గణనీయంగా తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఇలాంటి సర్దుబాట్లు తప్పవని నెట్‌ప్లిక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. తొలి దశ తొలగింపుల్లో కంపెనీ ఏకంగా తన ఒరిజనల్ సిరీస్ విభాగంలో క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌ను తప్పించింది.
సెబాస్టియన్ గిబ్స్, నెగిన్ సల్మసి వంటి ప్రముఖలపైనా వేటు వేసింది. ఈ ఏడాది మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని కంపెనీ సంకేతాలు పంపింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 20 లక్షలు తగ్గిందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. పోటీతత్వం పెరగడం, ఆర్ధిక వ్యవస్ధల మందగమనం, ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య పడిపోయిందని మరికొందరు ఇతరులకు తమ పాస్వర్డ్ షేర్ చేస్తుండటంతో కూడా సబ్‌స్క్రైబర్ బేస్ విస్తరించడం లేదని కంపెనీ వెల్లడించింది.