న్యూఢిల్లీ : ఎడ్టెక్ స్టార్టప్ అన్‌అకాడమీలో కొలువుల కోతకు బ్రేక్ పడలేదు. ఈ కంపెనీ తాజాగా మరో 150 మంది ఉద్యోగులను తొలగించింది. సామర్ధ్యం కనబరచడం లేదని చెబుతూ సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులపై వేటు వేసింది. కోర్ బిజినెస్ విభాగాల్లో ఉద్యోగులను అన్అకాడమీ తొలగించిందన ఇంక్42 నివేదిక వెల్లడించింది.
కాగా రెండు నెలల కిందట అన్అకాడమీ కంపెనీలోని పలు విభాగాల్లో పదిశాతం ఫుల్‌టైం, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. ఆపై మలిదశ లేఆఫ్‌లకు పూనుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగుల తొలగింపును నిర్ధారించిన అన్అకాడమీ వీటిని లేఆఫ్లుగా పరిగణించలేమని పేర్కొంది. అయితే తాము పారదర్శకంగా చేపట్టిన సామర్ధ్య పెంపు కార్యక్రమంలో (పీఐపీ) భాగంగా ఉద్యోగుల్లో కేవలం 2.6 శాతం మందిని ఎంపిక చేశామని, ఈ ప్రక్రియలో భాగంగా కొందరు ఉద్యోగుల వడపోత జరిగిందని అన్అకాడమీ పేర్కొంది.
ఇక మరో ఎడ్టెక్ కంపెనీ వేదాంతు సైతం 424 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ సీఈవో వంశీ కృష్ణ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో లేఆఫ్స్ గురించి సమాచారం అందించారు. 5900 మంది వేదాంతు సిబ్బందిలో 424 మంది మన సహోద్యోగులు కంపెనీని వీడుతున్నారని బ్లాగ్‌పోస్ట్‌లో ఆయన రాసుకొచ్చారు.