Credit Card | మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ ఏడాదిలో క్రెడిట్ కార్డు బిల్లులు గడువు దాటిన తర్వాత పే చేస్తే అదనంగా భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తే.. ఇప్పటికే లేట్ పేమెంట్ ఫీజు వసూలు చేస్తుంది. వచ్చేనెల 10 నుంచి ఆ లేట్ పేమెంట్ ఫీజు పెంచేసింది. కనుక ఈ అంశాన్ని క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ ఏమాత్రం చెల్లింపు తేదీ మిస్ అయినా ఫైన్‌తోపాటు అదనంగా వడ్డీ చెల్లించాల్సిందే. అంతే కాదు.. మీ క్రెడిట్ (సిబిల్) స్కోర్ కూడా దెబ్బ తింటుంది. క్రెడిట్ కార్డు.. మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి ఫైన్.. లేట్ ఫీజు నిర్ణయిస్తాయి బ్యాంకులు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఎస్బీఐ కార్డు, అమెరికా ఎక్స్ ప్రెస్ కార్డులపై విధించే లేట్ ఫీజు, అదనపు వడ్డీల గురించి తెలుసుకుందామా…!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లు గడువులోగా ఒకవేళ కనీస బిల్లు చెల్లించకపోయినా లేట్ పేమెంట్ ఫీజు వర్తిస్తుంది. లేట్ పేమెంట్ ఫీజు రూ.400 నుంచి రూ.1300 మధ్య ఉంటుంది. రూ.500 బిల్లు వరకు ఎటువంటి లేట్ ఫీజు ఉండదు. రూ.500-1000 మధ్య బిల్లుపై రూ.400 లేట్ పేమెంట్ ఫీజు వసూలు చేస్తుంది ఎస్బీఐ.
రూ.1000-2000 మధ్య బిల్లు డ్యూ డేట్ దాటకముందే చెల్లించకుంటే రూ.750, రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు రూ.950, రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రూ.1,100, రూ.50 వేలు దాటితే రూ.1300 లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాలి. ఒకవేళ రెండు వరుస డ్యూ డేట్లలో పేమెంట్ చేయకపోతే అదనపు లేట్ పేమెంట్ ఫీజు రూ.100 వడ్డిస్తుంది. పెండింగ్ ఇన్స్టాల్మెంట్ ఫీజు చెల్లించే వరకు రూ.100 అదనపు లేట్ పేమెంట్ ఫీజు విధిస్తూనే ఉంటుంది ఎస్బీఐ.
ప్రతి బ్యాంకు మాదిరిగానే హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ జారీ చేసిన రోజే పేమెంట్ తేదీ కూడా ముద్రిస్తుంది. పేమెంట్ ప్రాసెస్ కావడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఒకవేళ ఆ గ్రేస్ పీరియడ్ సమయం దాటిన తర్వాత కూడా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేదనుకోండి. మీరు చెల్లించాల్సిన బిల్లును బట్టి రూ.100 నుంచి రూ.1300 వరకు అదనపు లేట్ పేమెంట్ ఫీజు వసూలు చేస్తుంది.
మరో ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డులను, చెల్లించాల్సిన మొత్తం బిల్లును బట్టి అపరాధ రుసుము రూ.100 నుంచి రూ.1300 విధిస్తుంది. రూ.300 బిల్లు వరకు అదనపు చార్జీ వసూలు చేయదు. రూ.301-500 మధ్య బిల్లుపై రూ.100, రూ.501-10,000 మధ్య బిల్లుపై రూ.500, రూ.10,001 నుంచి రూ.750, రూ.25,001-50,000 మధ్య బిల్లుపై రూ.1000, రూ.50 వేల పై చిలుకు బిల్లు మీద రూ.1300 అపరాధ రుసుము వసూలు చేస్తుంది.
సిటీ బ్యాంక్ క్రెడిట్ కస్టమర్లు.. డ్యూ డేట్ లోపు బిల్లు చెల్లించకుంటే రూ.100-1,300 లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2000 వరకు ఎటువంటి అపరాధ ఫీజు వసూలు చేయదు. రూ.2000-7500 మధ్య రూ.600, రూ.7500-15000 మధ్య రూ.950, రూ.15 వేలు దాటితే రూ.1300 లేట్ పేమెంట్ పీజు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే కనీస మొత్తంలో 30 శాతం బిల్లు చెల్లించాలి. మినిమం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే ఆయా సంస్థల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. పేమెంట్ తేదీ దగ్గర పడుతుండగానే ఎస్సెమ్మెస్‌లు, మెయిల్ ద్వారా రిమైండర్లు పంపుతూ ఉంటుంది. ఒకవేళ గడువు మిస్ అయితే మొత్తం బిల్లుపై వడ్డీ, ఫైన్ చార్జి చేస్తాయి. తదుపరి నెల షాపింగ్‌లో వడ్డీ రహిత ఫైనాన్స్ సదుపాయం ఉండదు. బ్యాడ్ క్రెడిట్ హిస్టరీతోపాటు క్రెడిట్ స్కోర్ పడిపోతూ ఉంటుంది. మున్ముందు మీరు రుణ పరపతి పొందే అవకాశాలు మిస్సవుతారు. క్రెడిట్ కార్డు సంస్థలు తమ కస్టమర్లను పేమెంట్ మిస్ కానివ్వవు. మెయిల్, ఎస్సెమ్మెస్ ద్వారా ఎప్పుడు బిల్లు పేమెంట్ చేయాలో రిమైండర్స్ పంపుతూనే ఉంటాయి. ఒకవేళ మనీ తక్కువగా ఉంటే, కనీస మొత్తం చెల్లిస్తే పెనాల్టీ భారం తప్పుతుంది.