SBI RD A/C | ప్రతి రోజూ రూ.200 చొప్పున పొదుపు చేస్తే నెలకు రూ.6,200.. ఏడాదికి రూ.74,400.. పదేండ్లకు రూ.7,44,004.. అలా ఒక బ్యాంక్ డిపాజిట్ పథకంలో రూ.7,44,004 పొదుపు చేస్తే పదేండ్లలో రూ.10 లక్షలు అవుతుంది. ఈ ఫెసిలిటీ భారతీయ స్టేట్ బ్యాంక్ కల్పిస్తున్నది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న ఎస్బీఐ.. తన ఖాతాదారులకు పలు రకాల సేవలందిస్తున్నది. అందులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ డిపాజిట్ స్కీమ్‌తో ఎస్బీఐ ఖాతాదారులు మిలియనీర్లు కావచ్చు. ఇది ఎలాగో తెలుసుకుందాం.. !
ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.75 శాతం వడ్డీ అందిస్తున్నది. ఆయా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ టెన్యూర్లను బట్టి వడ్డీరేట్లు మారతాయి. రెండేండ్ల లోపు గడువు గల రికరింగ్ డిపాజిట్.. రెండేండ్ల నుంచి మూడేండ్ల వరకు గడువు గల రికరింగ్ డిపాజిట్‌పై 6.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది ఎస్బీఐ.
మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు.. ఐదేండ్ల నుంచి పదేండ్ల వరకు గడువు గల రికరింగ్ డిపాజిట్లపైన 6.25 శాతం అందిస్తున్నది ఎస్బీఐ. కనుక మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయి. ఒకవేళ సీనియర్ సిటిజన్లు రికరింగ్ డిపాజిట్లు చేస్తే 7.25 శాతం వడ్డీ ఇస్తున్నది.
ఇప్పుడు మీరు ఎస్బీఐలో పదేండ్ల టెన్యూర్‌తో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేశారనుకుందాం.. ఒక రోజుకు రూ.200 చొప్పున.. ప్రతి నెలా రూ.6,200 చొప్పున డిపాజిట్ చేయాలి. ఇలా పదేండ్ల పాటు రికరింగ్ డిపాజిట్లో నగదు డిపాజిట్ చేయడం వల్ల పదేండ్ల తర్వాత.. మెచ్యూరిటీ డేట్ వచ్చాక రూ.10 లక్షలకు పైగా రాబడి ఉంటుంది. ఇంతక కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే.. రాబడి కూడా అదే స్థాయిలో ఎక్కువ లభిస్తుంది.
ఎస్బీఐ ఖాతాదారులు రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతా ఓపెన్ చేయడానికి.. బ్యాంకు శాఖకు వెళ్లనవసరం లేదు. యోనో యాప్ ద్వారా ఆర్డీ ఖాతా తెరవొచ్చు. ప్రతి నెలా అందులో నగదు డిపాజిట్ చేయొచ్చు. ఒకవేళ ఎస్బీఐయేతర ఖాతాదారులైతే.. సమీపంలోని బ్యాంక్ శాఖకు వెళ్లి ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ ఖాతా ప్రారంభించిన వారు ఆటో డెబిట్ ఫీచర్ కూడా తీసుకోవచ్చు. ఆటో డెబిట్ ఫీచర్ వల్ల ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా ఆర్డీ ఖాతాలోకి డబ్బులు వెళ్లిపోతాయి. బ్యాంక్ శాఖకు వెళ్లి మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కాదు.. ఆర్డీ ఖాతా కల వారికి తేలిగ్గా రుణం కూడా లభిస్తుంది.