IDFC Bank CEO | కోట్ల రూపాయలు సంపాదించినా.. పేరు ప్రఖ్యాతులు సాధించినా.. దాతృత్వ గుణం ఉన్నప్పుడే దానికి విలువ. దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఆ కోవలోకే వస్తారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవో వీ వైద్యనాథన్ అనూహ్యరీతిలో దాతృత్వం ప్రదర్శించారు. తన కారు డ్రైవర్ మొదలు ఇంట్లోనూ, ఆఫీసులోనూ తనకు సహాయకులుగా పని చేసిన వారికి 5.30 లక్షల విలువ చేసే షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చేశారు. ఈ బ్యాంకులో వైద్యనాథన్‌కు తొమ్మిది లక్షల షేర్లు (3.7 శాతం వాటా) ఉన్నాయి. తాను గిఫ్ట్‌గా ఇచ్చిన షేర్లతో వచ్చే నిధులతో వారు ఇండ్లు కొనుగోలు చేసుకోవచ్చునని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. సోమవారం స్టాక్‌మార్కెట్ల ముగింపు వేళ షేర్ల విలువ ప్రాతిపదికన వాటి విలువ ఉంటుంది.
వైద్యనాథన్ దాతృత్వం ఇదే ఫస్ట్ టైం కాదు. 2018 జనవరి నుంచి తన వాటాలో సుమారు 38 శాతం షేర్లు గిఫ్ట్‌లుగా ఇచ్చేశారు. అప్పుడే లిస్టెడ్ బ్యాంక్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనమైన క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్ అధిపతిగా ఉన్నారు. ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్ విలీనంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆవిర్భవించింది. 2020లో తన చిన్ననాటి మ్యాథ్స్ టీచర్‌కు కూడా వైద్యనాథన్ గిఫ్ట్ ఇచ్చారు. విద్యార్థి దశలో ఉన్నత పాఠశాలకు ప్రయాణం చేయడానికి అవసరమైన రూ.500 ఇచ్చి ఆ మ్యాథ్స్ టీచర్ ప్రోత్సహించారు.
మరో రెండు లక్షల షేర్లు వెల్ఫేర్ ట్రస్ట్ కార్యక్రమాల కోసం విక్రయించినట్లు సోమవారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వైద్యనాథన్ తెలిపారు. 2018 డిసెంబర్ 18 నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఐదు శాతం పెరిగాయి. 2020 నాటి కరోనా దుర్భర పరిస్థితుల నుంచి కూడా బ్యాంక్ కోలుకున్నది. ఈ నేపథ్యంలో మరో టర్మ్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవోగా వైద్యనాథన్ నియమితులయ్యారు. 2024 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.