న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఐడీబీఐ బ్యాంక్ తమ ఎండీ, సీఈవో రాకేశ్ శర్మ జీతాన్ని దాదాపు పదింతలు చేయాలని ప్రతిపాదించింది. దీని అమలు కోసం ఓ సాధారణ తీర్మానాన్ని పాస్ చేసేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల అనుమతిని కూడా కోరింది. ఈ నెల 6న మొదలైన ఈ ప్రక్రియ.. వచ్చే నెల 5న ముగియనున్నది. ఆ తర్వాతి రెండ్రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాన్ని బ్యాంక్ వెల్లడించనున్నది. కాగా, శర్మ ప్రస్తుతం నెలకు రూ.2.64 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. దీన్ని సుమారు రూ.20 లక్షలకు పెంచాలని బ్యాంక్ చూస్తున్నది.
ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నుంచి బ్యాంకును బయటకు తీసుకురావడంలో శర్మ కృషిని గుర్తించిన ఐడీబీఐ.. ఆయన నెలసరి జీతాన్ని ఏకంగా రూ.17లక్షలకుపైగా పెంచాలని నిర్ణయించింది. పీసీఏతో ఎల్ఐసీ నాయకత్వంలోని ఐడీబీఐ రుణాలు, డిపాజిట్లు తదితరాలపై ఆర్బీఐ ఆంక్షలు వచ్చిపడిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే శర్మను బ్యాంక్ ఎండీ, సీఈవోగా మరో మూడేండ్లు కొనసాగించడానికీ ఐడీబీఐ వాటాదారుల అమోదాన్ని కోరుతున్నది. గత నెల 19 నుంచే కొత్త పదవీకాలం మొదలవుతుంది.