Omicron | వ్యాక్సినేషన్‌తో మహమ్మారిని కట్టడి చేసేశామని.. న్యూ నార్మల్ దిశగా అడుగులేద్దామని అగ్రరాజ్యం అమెరికా కార్పొరేట్ సంస్థల సీఈవోలు వేసుకున్న ప్రణాళికలు తిరగబడ్డాయి. వర్క్ ఫ్రం ఆఫీసు సేవలు ప్రారంభించాలని కార్పొరేట్ సంస్థల సీఈవోలు ఇంతకుముందు ప్లాన్లు సిద్దం చేశారు. కోవిడ్-19 న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌తో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు బిజినెస్ ప్రపంచం ప్లాన్లన్నీ అడ్డం తిరిగాయి. మహట్టన్ హాలీడే పార్టీలు రద్దయ్యాయి. ఒమిక్రాన్ వ్యాపిస్తుందన్న ఆందోళనతో బ్యాంకులు అప్రమత్తం అయ్యాయి.
ఇప్పటికే న్యూయార్క్ సిటీ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో సిటీ గ్రూప్ తమ సిబ్బందిని వర్క్ ఫ్రం హోం సేవలందించాలని కోరింది. హెడ్జ్ ఫండ్ సంస్థ సిటాడెల్ ఇదే ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన బయోటెక్ సంస్థలు హాజరుకాబోమని ప్రకటించడంతో శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించ తలపెట్టిన హెల్త్‌కేర్ సదస్సును జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో.. ఆన్లైన్ సదస్సుగా మార్చేసింది.
ఇక టెక్ దిగ్గజాల్ ఆపిల్, అల్పాబెట్ ఇంక్ గూగుల్.. ఇప్పటికే తమ సిబ్బందిని ఆఫీసులకు రావాలని జారీ చేసిన ఆదేశాలను నిరవధికంగా వాయిదా వేసేశాయి. న్యూయార్క్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. న్యూజెర్సీలో 13 శాతం కేసులు నమోదవుతున్నాయి. గతవారమే జెఫ్ఫరీస్ ఫైనాన్సియల్ గ్రూప్ తమ బ్యాంక్ సిబ్బందిని ఇండ్ల నుంచి పని చేయాలని ఆదేశించింది. బార్క్లేస్ ప్లీ కొన్ని హాలీడే పార్టీలను రద్దు చేసుకున్నాయి. గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ హాలీడే విందులు వాయిదా పడ్డాయి. క్రిస్మస్ వేడుకలకు సిద్ధం అవుతున్న అమెరికన్ల ప్రణాళికలు నిలిచిపోతున్నాయి.