చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేకు చెందిన కార్యాలయాలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు పలు చోట్ల తనిఖీలు జరిపారు. హువావే దేశంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), బెంగళూరు తదితర ప్రాంతాల్లోని హువావే కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో కంపెనీ అకౌంట్ బుక్స్ సునిశితంగా పరిశీలించినట్లు సమాచారం. మూడేండ్లకు సంబంధించిన కంపెనీ రికార్డులను తనిఖీ చేశారని తెలియవచ్చింది.
దేశంలో హువావే అసోసియేట్స్, క్లయింట్స్, పార్టనర్ల జాబితాను సిద్ధం చేసుకుని ఈ తనిఖీలు చేశారని అధికార వర్గాల కథనం. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఐటీ అధికారుల తనిఖీల నేపథ్యంలో భారత ప్రభుత్వ చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి వ్యవహరిస్తామని హువావే ఓ ప్రకటన చేసింది. ఐటీ అధికారుల దర్యాప్తునకు సహకరిస్తామని అన్నట్లు సమాచారం.
గత నెలలో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు పలు దఫాలు దాడులు చేసి సోదాలు జరిపారు. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ పన్ను ఎగవేతకు పాల్పడిందని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2017 ఆగస్టు – 2020 జూన్ మధ్య షియోమీ రూ.653 కోట్ల (88 మిలియన్ల డాలర్లు) పన్ను ఎగవేతకు పాల్పడిందని పేర్కొంది. కానీ షియోమీ ఈ అభియోగాన్ని నిరాకరించింది. భారత్ ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడే పని చేస్తున్నామని పేర్కొంది.
భారత్ మార్కెట్లో చైనా మొబైల్ ఫోన్ బ్రాండ్లు చాలా పాపులర్ అయ్యాయి. స్థానిక భారత్ బ్రాండ్ ఫోన్లపై పై చేయి సాధించాయి. తమ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలపై ఐటీ అధికారుల నేపథ్యంలో చైనా ఆందోళన వ్యక్తం చేసింది. తమ స్మార్ట్ ఫోన్ల సంస్థల పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వ అధికారులు అక్రమంగా అడిటింగ్ చేస్తున్నారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.