Hyundai Creta Flex Fuel | ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ (Hyundai Motor India).. దేశీయ మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో – 2025 (Bharat Mobility Global Expo 2025)లో సోమవారం హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ యున్సూకిమ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కం హోల్‌టైం డైరెక్టర్ తరుణ్ గార్గ్ ప్రొటోటైప్ హ్యుండాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యుయల్ కారును ఆవిష్కరించారు.
Hyundai Creta Flex Fuel కారు 100శాతం పెట్రోల్ (ఈ0), వందశాతం ఇథనాల్ (ఈ100)లతో పని చేస్తుంది. కర్బన ఉద్గారాల తగ్గింపుతోపాటు మెరుగైన పవర్, టార్క్ డెలివరీని బలోపేతం చేస్తాయి ఇథనాల్ పవర్డ్ వెహికల్స్. ప్రభుత్వ ఇన్సెంటివ్‌ల సాయంతో ఫ్లెక్స్ ఫ్యుయల్ కార్ల ధరలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం హ్యుండాయ్ క్రెటా కారు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లోనే హ్యుండాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్లు – 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో 99కిలోవాట్ల మోటార్‌తో వస్తోంది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 390 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇక 51.4కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో 126కిలోవాట్ల మోటార్‌తో వస్తున్నది. సింగిల్ చార్జింగ్‌తో 473 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. టాప్ వేరియంట్ కేవలం 7.9 సెకన్లలో 100 కి.మీ వేగం అందుకుంటుంది.
హ్యుండాయ్ (ఐసీఈ) క్రెటా కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5- లీటర్ల పెట్రోల్ ఇంజిన్ (113బీహెచ్పీ, 144 ఎన్ఎం టార్క్), 1.5-లీటర్ల డీజిల్ ఇంజిన్ (114బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్క్),1.5-లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ (158బీహెచ్పీ, 253 ఎన్ఎం టార్క్) వెలువరిస్తుంది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ట్రాన్స్మిషన్, డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, టర్బో పెట్రోల్ వేరియంట్ 7- స్పీడ్ డీసీటీ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.