Hyundai Cars Recall | హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ సెడాన్ మోడల్ కారు వెర్నా (Verna), ఎస్యూవీ కారు క్రెటా (Creta) కార్లలో సాంకేతిక లోపం కారణంగా 7,698 కార్లను రీకాల్ చేసింది. రెండు కార్లలోనూ సీవీటీ ఆటోమేటిక్ వేరియంట్స్ విత్ 1.5 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కార్లను రీకాల్ చేసినట్లు తెలిపింది. ఈ విషయమై కేంద్ర జాతీయ రహదారులు, రవాణామంత్రిత్వశాఖకు సమాచారం ఇచ్చింది.
క్రెటా, వెర్నా మోడల్ కార్లలోని ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ (Electronic fuel pump)లో సాంకేతిక లోపం తలెత్తిందని హ్యుండాయ్ తెలిపింది. సీవీటీ గేర్ బాక్స్ లోని ఎలక్ట్రానిక్ ఫ్యుయల్ పంపు పనితీరులో లోపం ఉండొచ్చునని భావిస్తున్నది. గతేడాది ఫిబ్రవరి 13 నుంచి జూన్ ఆరో తేదీ మధ్య తయారైన 7,698 యూనిట్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. వాలంటరీ కోడ్ ఆధారంగా ఈ కార్లను రీకాల్ చేస్తామని వెల్లడించింది.
కంపెనీ అధికారిక వర్క్ షాప్ ద్వారా కస్టమర్లను ఫోన్లు, ఎస్ఎంఎస్ సందేశాల ద్వారా కాంటాక్ట్ చేస్తామని హ్యుండాయ్ తెలిపింది. బాధిత కస్టమర్లు హ్యుండాయ్ డీలర్లు, లేదా హ్యుండాయ్ కాల్ సెంటర్ 1800-114-645 (టోల్ ఫ్రీ) నంబర్‌కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కార్లను టెస్టింగ్ చేసిన తర్వాత డిఫెక్ట్ సరి చేస్తారు. డిఫెక్టివ్ విడి భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని హ్యుండాయ్ పేర్కొంది.