న్యూఢిల్లీ, మే 2 : ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్‌కు చెందిన ఎస్యూవీ మాడల్ క్రెటా మరో మైలురాయిని సాధించింది. వరుసగా రెండో నెల ఏప్రిల్‌లోనూ అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో తొలిస్థానంలో నిలిచింది. గత నెలలో 17 వేల యూనిట్ల క్రెటా వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన దాంతో పోలిస్తే 10 శాతం వృద్ధిని కనబరిచాయి. సంస్థ మొత్తంగా 69,914 యూనిట్ల వాహనాలను విక్రయించగా, వీటిలో ఎస్యూవీ వాటా 71 శాతంగా ఉన్నదని పేర్కొంది. ఈ వాహనంపై కస్టమర్లు పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శణమని కంపెనీ సీవోవో, డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. క్రెటాతోపాటు వెన్యూ, ఎక్స్టర్, అల్కాజర్, ఇతర మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. పదేండ్ల క్రితం దేశీయ రోడ్లపైకి అందుబాటులోకి వచ్చిన ఈ మాడల్‌కు 12 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.