Hyundai Alcazar | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: హ్యుందాయ్ మోటర్ ఇండియా సోమవారం తమ సెవెన్ సీటర్ ఎస్యూవీ అల్కజార్ సరికొత్త వెర్షన్స్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ.14.99 లక్షలుగా ఉన్నది. డీజిల్ వేరియంట్స్ ఆరంభ ధర రూ.15.99 లక్షలు. కాగా, దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) అమ్మకాలు క్రమేణా పెరుగుతున్నట్టు ఈ సందర్భంగా ఇక్కడ హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్ విలేకరులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే తమ సంస్థ అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటానే 67 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇండస్ట్రీ సగటు 53 శాతమేనని గుర్తుచేశారు. మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటాకు కూడా మార్కెట్లో డిమాండ్ బాగానే ఉందని, ఇప్పటికే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ఇక నయా అల్కజార్ కోసం సవరించిన ధరలు.. మరింతమంది కస్టమర్లను ఆకర్షిస్తాయన్న విశ్వాసాన్ని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ హ్యుందాయ్ అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. గతంలో సుమారు 17 శాతంగా ఉన్న సంస్థ వాటా.. ఇప్పుడు 21.3 శాతానికి పెరిగినట్టు వివరించారు. తమ కస్టమర్ల కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)తో వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నట్టు పేర్కొన్నారు.