Air india to tata | ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ( ఏఐ ) అమ్మకంపై శుక్రవారం కొంత హడావుడి నడిచింది. టాటాల చేతిలోకి ఎయిరిండియా వెళ్తున్నదని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇదంతా అవాస్తవమని కేంద్రం కొట్టిపారేసింది.
ఎయిర్ ఇండియా ( Air India ) కోసం వేసిన బిడ్డింగ్ ( Air India bid )లో టాటా గ్రూప్ ( Tata group ) గెలిచిందని బ్లూంబర్గ్ ( bloomberg ) ప్రకటించింది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ టాటాల గూటికే ఎయిరిండియా చేరబోతున్నదని చెప్పింది. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు చెప్తామంటూ ఆర్థిక శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎయిరిండియా సేల్‌ను పర్యవేక్షిస్తున్న పెట్టుబడులు-ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే సైతం ఇంకా ఏ ఫైనాన్షియల్ బిడ్ తుది ఆమోదం పొందలేదని ట్వీట్ చేశారు. దీనిపై టాటా సన్స్ కూడా స్పందించేందుకు నిరాకరించింది.
1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్డీ టాటా స్థాపించారు. 1946లో ఎయిర్ ఇండియాగా స్టాక్ మార్కెట్లలో నమోదైంది. 1948లో ఐరోపా దేశాలకు విమాన సర్వీసులతో అంతర్జాతీయ సేవల్ని ప్రారంభించింది. అయితే 1953లో ఎయిర్ ఇండియాను జాతీయం చేశారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేశారు. అప్పట్నుంచి సంస్థకు ఆర్థిక ఇబ్బందులు మొదలవగా, 2019 మార్చి 31 నాటికి రూ.60,074 కోట్ల రుణ భారం ఉన్నది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిడ్లను ఆహ్వానించగా, ఎట్టకేలకు నలుగురు ముందుకొచ్చారు. ఇందులో చివరిదాకా మిగిలింది ఇద్దరే. ఒకరు టాటా, మరొకరు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్. అయితే ఈ రెండు బిడ్లను కొద్దిరోజుల క్రితం పెట్టుబడుల ఉపసంహరణపై కార్యదర్శుల బృందం తెరిచి పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్ణీత రిజర్వ్ ధర కంటే ఎక్కువగా టాటా సన్స్ బిడ్ ఉన్నట్లు గుర్తించారని చెప్తున్నారు. అయితే దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలోని మంత్రుల బృందం ఆమోదించాల్సి ఉందని సదరు వర్గాలు అంటున్నాయి. టాటా సన్స్ బిడ్ ఈ మంత్రుల కమిటీ ముందుకే వెళ్లిందని, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావచ్చని పేర్కొంటున్నారు. ఈ కమిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా కూడా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Amit Shah Commitee on Maharaja | అమిత్‌షా కమిటీ ఫైనల్.. ఎయిర్ఇండియా ‘ఘర్ వాపసీ’..?!
ఎయిర్పోర్ట్ యూజర్ చార్జీల పెంపు
TATA micro Punch | 4 నుంచి టాటా పంచ్ బుకింగ్స్.. అయితే..!
Amazon | అంబానీకి షాక్.. జియోకు దీటుగా హైస్పీడ్ ఇంటర్నెట్ ఇస్తామంటున్న అమెజాన్.. టెస్లా కూడా!?
Amazon GIF | అమెజాన్ జీఐఎఫ్తో రాష్ట్రంలో 31వేల వ్యాపారులకు బెనిఫిట్