Home Sales | కరోనా తర్వాత సొంతింటికి పెరిగిన ప్రాధాన్యం.. చారిత్రక స్థాయిలో తగ్గిన వడ్డీరేట్లు.. ఇండ్ల కొనుగోళ్లలోనూ.. వాటి ధరల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో భాగ్యనగరంలో ఇండ్ల ధరలు 2.5 శాతం శరవేగంగా పెరిగాయి. రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో ఇండ్ల కొనుగోళ్లు.. వాటి ధరలపై నిర్వహించిన సర్వేలో భారత్‌లో హైదరాబాద్‌తోపాటు 4నగరాలు చోటు దక్కించుకున్నాయి. తర్వాతీ స్థానాల్లో చెన్నైలో 2.2, కోల్‌కతాలో 1.5, అహ్మదాబాద్‌లో 0.4 శాతం ధరలు పెరిగాయి.
2021 తృతీయ త్రైమాసికంలో గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం 93 శాతం ధరలు పెరిగాయి. గ్లోబల్ ఇండెక్స్‌లో హైదరాబాద్ 128, చెన్నై 131, కోల్‌కతా 135, అహ్మదాబాద్ 139 ర్యాంక్ పొందాయి. ఇక దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై.. 146వ స్థానాన్ని ఆక్రమించింది. ముంబై మహా నగరంలో ఇళ్ల ధరలు 1.8 శాతం తగ్గుముఖం పట్టాయి. బెంగళూరులో 0.2 శాతం ధరలు పడిపోవడంతో 140 ర్యాంక్, ఢిల్లీలో 0.7, పుణెలో 1.5 శాతం తగ్గాయి.
ప్రభుత్వ ఉద్దీపనల మద్దతు.. పెరిగిన కుటుంబాల పొదుపు.. అతి తక్కువ వడ్డీరేట్లతో భారత్‌లో సొంతిండ్లకు డిమాండ్ పుంజుకున్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ చెప్పారు. 18 నెలలుగా ఇండ్ల కొనుగోళ్లలో వాటి ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. డిమాండ్ పెరిగినా కొద్దీ.. పలు నగరాల్లో విలువ పెరుగుతుందన్నారు. సొంతిండ్లకు గిరాకీ క్రమంగా పుంజుకుంటుందన్నారు. భవిష్యత్ డిమాండ్‌ను బట్టి ఇండ్ల ధరలు ఖరారవుతాయని శిశిర్ బైజాల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా సగటున 10.6 శాతం ఇండ్ల ధరలు పెరిగాయి. 2021 మూడో త్రైమాసికంలో 44 శాతం నగరాల్లో ఇండ్ల ధరల్లో డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించింది. టర్కీలోని ఇజిమిర్ నగరంలో 34.8 శాతం ధరలు పెరిగాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండ్ల ధరలు పెరిగిన నగరంగా ఇజిమిర్ నిలిచింది. ఇంకా న్యూజిలాండ్ రాజధాని విల్లింగ్టన్లో 33.5 శాతం, అమెరికాలోని ఫోనిక్స్ 33.1, ఆస్ట్రేలియాలోని హాలిఫాక్స్‌లో 31.7, కెనడాలోని హోబార్ట్ సిటీలో 30.9 శాతం ధరలు పెరిగాయి. జూన్-సెప్టెంబర్ మధ్య 51 నగరాల్లో ఇండ్ల ధరలు పడిపోయాయి. మాస్కో, టెలీ అవీవ్, పెర్త్ నగరాల్లో భారీగా ఇండ్ల ధరలు పతనం అయ్యాయి.
వడ్డీరేట్లు, కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్, ద్రవ్యోల్బణం వత్తిళ్లు తదితర అంశాలు ఇండ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రియాల్టీ రంగానికి సానుకూల మద్దతు కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.