హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రెడ్ క్యాటగిరీ (కాలుష్యకారక)లోని ఫార్మా కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ప్రతిపాదిత ఫార్మాసిటీ భూముల్లో గ్రీన్ ఫార్మాసిటీని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. రెడ్ క్యాటగిరీ పరిశ్రమల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నది. దీంతో బల్క్‌డ్రగ్, యాంటీ బయోటిక్స్ ఔషధ సంస్థలు అయోమయంలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఫార్మా రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లో రెడ్ క్యాటగిరీ పరిశ్రమలు ఇప్పటికీ దొంగచాటుగా వ్యర్థాలను పారబోయాల్సిన పరిస్థితి ఉందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. దీంతో మానవాళి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఈ ఔషధాల తయారీ దొంగచాటు వ్యవహారంగా మారింది. వీటి తయారీ వల్ల వాయు, జల కాలుష్యం ముప్పు ఉండటంతో వీటిని రెడ్ క్యాటగిరీలో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే వ్యర్థాల శుద్ధి ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వాలు వీటిపై పెద్దగా దృష్టి కేంద్రీ కరించడంలేదు. దాంతో కంపెనీలు రాత్రి వేళల్లో ఎవరికి తోచినవిధంగా వారు వ్యర్థ జలాలను నాలాల్లో, అడవుల్లో, ఖాళీ జాగాల్లో పారబోస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఔషధ కంపెనీలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా రెడ్ క్యాటగిరీ ఇండస్ట్రియల్ పార్క్ లేకపోవడం పెద్ద లోటుగా ఉందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
దేశానికి ఔషధ రాజధానిగా వర్ధిల్లుతున్న హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫార్మాసిటీకి అంకురార్పణ చేశారు. సుమారు 16 వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, 13 వేల ఎకరాల భూముల సేకరణ కూడా పూర్తయింది. కాగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రాంతంలో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు కోర్టుకు తెలిపింది. అయితే గ్రీన్ క్యాటగిరీలో ఎక్కువగా ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తులకు మాత్రమే చోటు లభిస్తుందని, అల్లోపతి ఔషధాలు 90 శాతం రెడ్ క్యాటగిరీలోనే ఉంటాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్నిబట్టి ప్రభుత్వం గ్రీన్ ఫార్మాసిటీలో ప్రధాన ఔషధాల తయారీకి అనుమతించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా పరిశ్రమలను వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ క్యాటగిరీలుగా విభజిస్తారు. ఇందులో హానికారక కెమికల్స్, బల్క్‌డ్రగ్, విష వాయువులు, పర్యావరణానికి, జీవ జాతులకు హాని కలిగించే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను రెడ్ క్యాటగిరీలో ఉంచారు. దాదాపు 90 శాతం ఫార్మా కంపెనీలు ఈ కేటగిరిలోకే వస్తాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మాసిటీలో జీరో లిక్విడ్ టెక్నాలజీతో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫార్మాసిటీలో కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(సీఈటీపీ)ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. కొన్ని కంపెనీలు సొంత ఖర్చుతో చిన్నతరహా సీఈటీపీలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో శుద్ధిచేసేవి కాదు. దీంతో కష్టాలు తప్పట్లేదు.
పరిశ్రమల క్యాటగిరీలు ఇలా…
కాలుష్య సూచిక స్కోర్ 60,
అంతకంటే ఎక్కువ ఉంటే- రెడ్
41 నుంచి 59 వరకు ఉంటే- ఆరెంజ్
21 నుంచి 40 వరకు ఉంటే- గ్రీన్
20, అంతకంటే తక్కువ ఉంటే- వైట్