హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మాదిగ యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని ఫిక్కీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మిక్కీ (మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు (మికీ) పెద్ద ఎత్తున కృషి చేయాలని, అందుకు కావాల్సిన సహకారాన్ని, అవకాశాలను కల్పించాలని ఆయన సూచించారు.
ఇప్పటికే మికీ ఆధ్వర్యంలో వైద్యశాలలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించి పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంపై వినోద్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మిక్కి అధ్యక్షుడు విప్లవ్గాంధీ, ఫౌండర్ సభ్యులు మహేశ్, ప్రతినిధులు చైతన్య, ఉమాపతి, అభిలాష్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.