హైదరాబాద్ అందరిది.. అంతా మెచ్చినది.. ఇక్కడ జీవనం ఎవరికైనా సాధ్యమే.
అవును.. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో బతికేయడం చాలా సులభమని సర్వేలు చెప్తున్నాయి.
అటు సంపన్నులకు.. ఇటు సామాన్యులకు అనువైనది మన రాజధాని నగరం మాత్రమేనని అంటున్నారిప్పుడు.
ముంబై, జూన్ 29: నవాబుల దగ్గర్నుంచి గరీబులదాకా.. హైదరాబాద్ నగర జీవనశైలి ఓ అద్భుతం. ఈ విశ్వనగర వైవిధ్యానికి ఓ తాజా సర్వే సైతం అద్దం పట్టిందిప్పుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాల్లోని జీవన వ్యయాన్ని చెప్తూ ‘మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ వివరాలు విడుదలయ్యాయి. ప్రవాసులకు సంబంధించి వెల్లడైన ఈ ర్యాంకుల్లో భారత్‌లో ముంబై చాలా ఖరీదైన నగరమని తేటతెల్లమైంది. వేరే చోట్ల నుంచి వచ్చేవారికి ఇక్కడ జీవన వ్యయం ఇతర భారతీయ నగరాలతో పోల్చితే ఎంతో ఎక్కువని స్పష్టమైంది. ఇదే క్రమంలో అనేక అంశాల్లో హైదరాబాద్ ఉత్తమమని, అన్ని వర్గాలకు అనువైన జీవనశైలి భాగ్యనగరం సొంతమని కూడా సర్వే తెలియజేసింది.
భారత్‌లో హౌజింగ్ విషయంలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ఆకర్షణీయంగా ఉందని మెర్సర్ తమ సర్వేలో తేల్చిచెప్పింది. ఇక్కడి సరసమైన ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నది. అందుకే దేశీయ హౌజింగ్ మార్కెట్లో హైదరాబాదే ఫేవరేట్‌గా ఉందన్నది. తమ పరిశీలనలో అందరికీ చౌకగా హైదరాబాద్‌లోనే ఇండ్లు లభిస్తాయని స్పష్టమైనట్టు మెర్సర్ చెప్పింది. అద్దెల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూ రు నగరాలు దేశంలోనే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి.
జీవన వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు దేశంలో హైదరాబాద్‌వైపే చూస్తున్నాయని మెర్సర్ తెలియజేసింది. భారత్‌కు ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్నందున ఎన్నో బహుళజాతి సంస్థలు అక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయని చెప్తూనే.. ద్రవ్యోల్బణం దృష్ట్యా హైదరాబాద్, చెన్నై, పుణె వంటి ప్రత్యామ్నాయ నగరాలపైనా అంతే స్థాయిలో దృష్టిసారిస్తున్నాయని పేర్కొనడం గమనార్హం.
జీవన వ్యయంలో ప్రపంచంలోని టాప్-10 ఖరీదైన నగరాల్లో నాలుగు స్విట్జర్లాండ్‌కు చెందినవే. ఐదు ఖండాల్లోని 227 నగరాల్లో ఈ ఏడాది మార్చిలో సర్వే జరిగింది. హౌజింగ్, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర 200లకుపైగా అంశాల్లో ఖర్చుల ఆధారంగా నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.