Huawei Mate XT Ultimate | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే (Huawei) గ్లోబల్ మార్కెట్లో తొలి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మ్యాట్ ఎక్స్‌టీ అల్టిమేట్ ను మంగళవారం ఆవిస్కరించింది. 10.2 అంగుళాల లార్జ్ స్క్రీన్ తో వస్తున్న ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌కు హువావే మ్యాట్ ఎక్స్‌టీ అల్టిమేట్ (Huawei Mate XT Ultimate) అని పేరు పెట్టారు. ట్రిపుల్ ఔటర్ కెమెరా సెటప్ (50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 12 మెగా పిక్సె్ల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 12-మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా), 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్. ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే హువావే తన తొలి ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించడం ఆసక్తి కర పరిణామం.
హువావే మ్యాట్ ఎక్స్‌టీ అల్టిమేట్ (Huawei Mate XT Ultimate) ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.2,35,900 (19,999 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.2,59,500 (21,999 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.2,83,100 (23,999 చైనా యువాన్లు) పలకుతుంది. డార్క్ బ్లాక్, రూయి రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 20 నుంచి చైనాలో అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
హువావే మ్యాట్ ఎక్స్ టీ అల్టిమేట్ ఫోన్ హార్మోనీ ఓఎస్ 4.2 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. అన్ ఫోల్డ్ చేసినప్పుడు 10.2 అంగుళాల (3184×2232 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ ఎల్టీపీఓ ఓలెడ్ స్క్రీన్, ఒకసారి ఫోల్ట్ చేసినప్పుడు 7.9 అంగుళాల (2048×2232 పిక్సెల్స్) స్క్రీన్, రెండోసారి ఫోల్డ్ చేసినప్పుడు 6.4 అంగుళాల స్క్రీన్ (1008x 2232 పిక్సెల్స్) ఉంటుంది. ఈ ఫోన్ లో ఏ ప్రాసెసర్ వాడారన్న సంగతి వెల్లడించలేదు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ 3.1 టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుందీ ఫోన్. బయో మెట్రిక్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్సానర్ ఉంటుంది. 66వాట్ల వైర్డ్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. చైనా మార్కెట్లో ఆవిష్కరించిన హువావే మ్యాట్ ఎక్స్‌టీ అల్టిమేట్ ఫోన్‌ను భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారా? లేదా? అన్న సంగతి తెలియాల్సి ఉంది.