హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : అమెరికాకు చెందిన బహుళజాతి కన్జ్యూమర్ గూడ్స్ దిగ్గజ సంస్థ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) తమ నూతన అధ్యక్షుడు, సీఈవోగా శైలేష్ జెజురికర్ను ప్రకటించింది. అయితే ఈయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) పూర్వ విద్యార్థి (1984 బ్యాచ్) కావడం గమనార్హం. ఇప్పటికే హెచ్పీఎస్ పూర్వ విద్యార్థులు అజయ్ బంగా, సత్యా నాదెళ్ల అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విషయం తెలిసిందే.
ఇప్పుడీ జాబితాలోకి శైలేష్ జెజురికర్ కూడా చేరారు. కాగా, ప్రస్తుతం శైలేష్ పీ అండ్ జీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా ఉన్నారు. ఇప్పటి అధ్యక్షుడు, సీఈవోగా ఉన్న జాన్ ఆర్ మొయెల్లర్ దిగిపోయాక, వచ్చే జనవరి 1 నుంచి శైలేష్ ఆ స్థానంలోకి రానున్నారు. కాగా, 187 ఏండ్ల పీ అండ్ జీ చరిత్రలో భారత్లో జన్మించిన వ్యక్తి కంపెనీకి నాయకత్వం వహిస్తుండటం ఇదే తొలిసారి. దీంతో హెచ్పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తి నోరియా ప్రత్యేకంగా అభినందించారు.