పోదాం పదండి ఇలా.. దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుదామా?
భారతీయ స్టాక్ మార్కెట్.. పెట్టుబడులకు సంబంధించి ఓ నియంత్రిత వేదిక. దీని ద్వారా కంపెనీలు పబ్లిక్ లిస్టెడ్ అవుతాయి. ఆ కంపెనీల షేర్లను ఎవరైనా కొనడం లేదా అమ్మడం చేయవచ్చు. ఇక సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రణలో స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరుగుతాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లు గడిచిన రెండు దశాబ్దాల్లో కోట్లాది మంది మదుపర్లకు విశేషంగా సంపదను సమకూర్చాయి. గత ఐదారేండ్లుగానైతే చాలామంది ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో ముందు వరుసలో నిలుస్తున్నది. అయితే ఇప్పటికీ కొంతమందికి ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన జియో ఐపీవో రికార్డుల పరంపరనూ చూశాం. మరి.. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఏం చేయాలి? షేర్లను కొనేందుకున్న మార్గాలేమిటి? అనేదానిపై మార్కెట్ నిపుణుల మాటేంటి..
భారతీయ స్టాక్ మార్కెట్.. పెట్టుబడులకు సంబంధించి ఓ నియంత్రిత వేదిక. దీని ద్వారా కంపెనీలు పబ్లిక్ లిస్టెడ్ అవుతాయి. ఆ కంపెనీల షేర్లను ఎవరైనా కొనడం లేదా అమ్మడం చేయవచ్చు. ఇక సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రణలో స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరుగుతాయి. ప్రస్తుతం దేశంలో ప్రధానంగా రెండు ఎక్సేంజీలున్నాయి. అవి..
నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ) : ఇందులో ప్రధాన సూచీ నిఫ్టీ 50. దేశంలోని 50 అతిపెద్ద పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇక్కడ ట్రేడ్ అవుతాయి. వాల్యూమ్‌పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్సేంజీ.
బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) : ఇందులో ప్రధాన సూచీ సెన్సెక్స్ 30. దేశంలోని 30 అతిపెద్ద పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇక్కడ ట్రేడ్ అవుతాయి. ఆసియాలోనే అత్యంత ప్రాచీన స్టాక్ ఎక్సేంజీ. 1875లో ఏర్పాటైంది. అటు ఎన్ఎస్ఈలోనైనా, ఇటు బీఎస్ఈలోనైనా సెబీ నమోదిత బ్రోకర్ ద్వారానే ట్రేడింగ్ జరుపాల్సి ఉంటుంది.
ఈ సాధనాల ద్వారా..
ఈక్విటీలు (స్టాక్స్), మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు (ఎక్సేంజీ ట్రేడెడ్ ఫండ్స్), ఐపీవోలు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు), డెరివేటివ్‌ల ద్వారా పెట్టుబడులకు వీలున్నది.
ఇదీ సంగతి..
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మూడు అకౌంట్లు అవసరం. అందులో 1. బ్యాంక్ అకౌంట్ 2. ట్రేడింగ్ అకౌంట్ 3. డీమ్యాట్ అకౌంట్. ముందుగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలకు లింకైన బ్యాంక్ అకౌంట్లో ఇన్వెస్టర్లు కొంత నగదును పెట్టుకోవాలి. ఆ తర్వాత ట్రేడింగ్ అకౌంట్లో ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈలోని కంపెనీల షేర్లను కొనడానికి ఆర్డర్ పెట్టాలి. మీరు సూచించిన ధరకు కోరుకున్న షేర్లుంటే.. మీ బ్యాంక్ ఖాతా నుంచి నగదు ట్రేడింగ్ రోజునే బ్లాక్ లేదా కట్ అవుతాయి. మరుసటి ట్రేడింగ్ రోజున మీ డీమ్యాట్ ఖాతాలో షేర్లు జమవుతాయి. షేర్లను అమ్మాలనుకున్నప్పుడు ట్రేడింగ్ రోజున బ్లాకైనా, మరుసటి రోజునే మీ డీమ్యాట్ ఖాతా నుంచి నిర్ణీత షేర్లు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ ఖాతాలో సదరు నగదు మొత్తాలు అప్పుడే జమవుతాయి. అయితే ఈ ప్రక్రియ మొత్తం సెబీ నమోదిత స్టాక్ బ్రోకర్ల ద్వారానే జరుగుతుంది. వారు లేకుండా షేర్ల క్రయవిక్రయాలను వ్యక్తిగత మదుపర్లు స్టాక్ ఎక్సేంజీలపై నిర్వహించడానికి వీల్లేదు. గ్రో, జెరోధా, ఏంజెల్ వన్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ తదితర సెబీ నమోదిత బ్రోకర్లను సంప్రదిస్తే మీ పని సులభమైపోతుంది. చార్జీలుంటాయి.
సంప్రదాయ బ్రోకర్ లేకుండా..
- మ్యూచువల్ ఫండ్స్ (సిప్ లేదా లంప్సం), ఐపీవోలు, ఈటీఎఫ్‌లు లేదా ఇండెక్స్ ఫండ్ల ద్వారా కూడా మదుపర్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. నెలనెలా లేదా కోరుకున్న వాయిదాలు/పద్ధతుల్లో ఈ పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అయితే ఈ లావాదేవీలకు కొన్ని చార్జీలు వర్తిస్తాయి.
- చాలా బ్రోకర్లు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను ఒకే అప్లికేషన్ ప్రాసెస్‌లో తెరుస్తున్నారు. ఇందుకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్ చెక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసమైతే ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా కావాలి.
- కంపెనీ షేర్లను కొనాలనుకుంటే దాని ఆదాయ-లాభాల్లో వృద్ధి, రుణ భారం, ఈక్విటీపై రిటర్న్స్, ప్రైస్-టు-ఎర్నింగ్స్ రేషియో, ప్రమోటర్ హోల్డింగ్‌ల గురించిన సమాచారం మొత్తం తెలుసుకోండి. అవగాహన లేకుండా పెట్టుబడులకు దిగవద్దు.
- బ్రోకర్లను ఎంచుకొనేటప్పుడు వారి సెబీ రిజిస్ట్రేషన్, డిపాజిటరీ పార్టిసిపెంట్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ క్వాలిటీ, రిసెర్చ్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ వంటివాటిని క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం.
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను కొత్తగా ప్రారంభించేవారు లిమిట్ ఆర్డర్లనే ఎంచుకోవడం మంచిది. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి కాబట్టి నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.
- దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం నెల, త్రైమాసిక, వార్షిక పద్ధతుల్లో సమీక్షలు చేస్తూ పోవాలి. మీరు కొన్న షేర్లకు సంబంధించిన సంస్థ వ్యాపారం ఎలా నడుస్తున్నది. దాని లాభనష్టాలు ఎలా ఉంటున్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదన్న అంశాలపై తప్పక దృష్టి పెట్టాలి.
- స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. సురక్షిత పెట్టుబడులను ఆశించేవారు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), ఇతర ప్రభుత్వ పథకాలను పరిశీలించడం మంచిది.

తొలి ట్రేడ్..
మీ బ్రోకర్‌కు చెందిన వేదిక ద్వారా నేరుగా షేర్ల కోసం ఆర్డర్ పెట్టుకోవచ్చు.
- తొలుత రిలయన్స్, టీసీఎస్, ఎస్బీఐ.. ఇలా ఏ షేర్లనైనా కొనాలనుకుంటే దాని టిక్కర్ సింబల్స్ ద్వారా వెతకాలి.
- కోరుకున్న సంస్థ షేర్లు కనిపిస్తే (Buy) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మార్కెట్ ఆర్డర్ (ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధర), లిమిట్ ఆర్డర్ (మీరు ఆశించిన ధర)లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. మార్కెట్ ఆర్డర్‌ను ఎంచుకుంటే త్వరగా షేర్లు మీ ఖాతాలో జమవుతాయి. లిమిట్ ఆర్డర్‌ను ఎంచుకుంటే సమయం పడుతుంది.
- ఎన్ని షేర్లు కావాలో పేర్కొనాలి.
- కన్ఫమ్, సబ్మిట్ చేయాలి.
- షేర్లు అందుబాటులో ఉంటే.. మరుసటి ట్రేడింగ్ రోజు మీ డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. అయితే ట్రేడింగ్ రోజునే మీ బ్యాంక్ ఖాతాలో నగదు బ్లాక్ లేదా కట్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

