హైదరాబాద్ , జూన్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డుకు చెందిన ఫ్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం వేయనున్నట్టు హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల పూర్తయిన అపార్ట్మెంట్లు, మరికొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను ఉన్నతీరుగానే విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 20న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీస్థలాలు, ఫ్లాట్లను బహిరంగ వేలం వేయాలని హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయించాయి.
ఇందుకు సంబంధించి గృహ నిర్మాణశాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు సంబంధించి వనరుల సమీకరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 20 నాటికి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లతోపాటు, ఓపెన్ ప్లాట్లు.. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని నాలుగు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు గౌతమ్ తెలిపారు.
రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో (ఒకో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉన్న టవర్‌ను ఒకే యూనిట్‌గా) ఏక మొత్తంగా విక్రయించనున్నట్టు, బిల్డర్లు, ఒక గ్రూప్‌గా ఏర్పడి కానీ, బహుళ అంతస్థుల భవనాల అవసరం ఉన్న సంస్థలు కానీ వీటిని తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.