Activa H-Smart | దేశంలోనే రెండో అతిపెద్ద టూ వీలర్స్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మార్కెట్లోకి సోమవారం కొత్త యాక్టీవా స్కూటర్ తీసుకొచ్చింది. యాక్టీవా హెచ్-స్మార్ట్ పేరుతో వస్తున్న ఈ స్కూటర్లో కారులో మాదిరి స్మార్ట్ ఫీచర్లు జోడించింది. కారు మాదిరే..ఈ యాక్టీవా స్కూటర్ ఏ ప్రాంతంలో ఉందో తేలిగ్గా కనిపెట్టొచ్చు. యాక్టీవా హెచ్-స్మార్ట్ స్కూటర్ ధర రూ.74,536 నుంచి మొదలవుతుంది.
హోండా యాక్టీవా హెచ్-స్మార్ట్ స్కూటర్ మూడు ట్రిమ్స్- స్టాండర్డ్, డీలక్స్, స్మార్ట్ వేరియంట్లలో వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ రూ.74,536, డీలక్స్ వేరియంట్ రూ.77,036, స్మార్ట్ వేరియంట్ రూ.80,537లకు లభ్యం అవుతుంది. స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్ వంటి నాలుగు ప్రధాన స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నది హెచ్-స్మార్ట్ యాక్టీవా. ఐదు కొత్త పేటెంట్ అప్లికేషన్స్ కూడా ఈ స్కూటర్లో జత కలిశాయి.
హోండా స్మార్ట్ అన్‌లాక్ ఫీచర్‌తో మీరు మీ యాక్టీవా హ్యాండిల్ బార్స్‌ను లాక్/అన్‌లాక్ చేయొచ్చు. ఫ్యూయల్ స్టోరేజీ ఏరియా, ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఫిజికల్ కీ లేకుండానే రైడర్లు తమ స్కూటర్‌కు లాక్ వేయొచ్చు. అన్‌లాక్ చేయొచ్చు. స్కూటర్‌కు రెండు మీటర్ల దూరం నుంచే స్టార్ట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ కీతో ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు. స్విచ్ ఆపేయవచ్చు. రియల్‌టైం డ్రైవింగ్ ఎమిషన్స్ స్థాయిని పర్యవేక్షించడానికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆన్‌బోర్డ్ `సెల్ఫ్-డయాగ్నస్టిక్ డివైజ్ (ఓబీడీ 2)`డివైజ్ తప్పనిసరి.
ఆన్‌బోర్డ్ డయాగ్నొస్టిక్స్ (ఓబీడీ) వ్యవస్థ సాయంతో స్కూటర్ ప్రామాణిక కర్బన ఉద్గారాల నిబంధనలను పాటిస్తున్నదా? లేదా? అన్న సంగతిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. లాంగ్ ఫుట్బార్డ్ ఏరియా, న్యూ పాసింగ్ స్విచ్ఛ్, డీసీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, నూతనంగా డిజైన్ చేసిన అల్లాయ్వీల్స్ జత చేశారు. స్కూటర్ నుంచి ప్రమాణాలకు మించి కర్బన ఉద్గారాలు వెలువడితే ఆటోమేటిక్‌గా వార్నింగ్ లైట్స్ సంకేతాలిస్తుంటాయి. కాగా, దేశీయ స్కూటర్ల మార్కెట్లో హోండా మోటార్ సైకిల్స్ 56 శాతం వాటా కలిగి ఉంది.