న్యూఢిల్లీ, జూన్ 29: రుణభారంతో ఉన్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ పునరుద్ధరణ ప్రణాళికకు హిందూ జా గ్రూప్ సంస్థ సమర్పించిన బిడ్‌కు రుణదాతల ఆమోదం లభించింది. రిలయన్స్ క్యాపిటల్‌ను కొనేందుకు హిందూజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) రెండో రౌండ్ బిడ్డింగ్‌లో బిడ్డర్లు అందరికంటే అత్యధికంగా రూ.9,661 కోట్ల నగదు ఆఫర్ సమర్పించింది. దీంతో ఐఐహెచ్ఎల్కు అనుకూలంగా 99 శాతం రుణదాతలు ఓటు చేశారు.
ఈ ఆఫర్‌ను ఎన్సీఎల్టీ అనుమతిస్తే రిలయన్స్ క్యాపిటల్‌కు ఇచ్చిన రుణంలో బ్యాంకర్లు వెనువెంటనే రూ. 9,661 కోట్లు రికవరీ చేసుకోగలుగుతారని, ఆ కంపెనీ వద్దనున్న రూ. 500 కోట్ల నగదు నిల్వ సైతం రుణదాతలకు వెళుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హిందూజాల ఆఫర్‌తో మొత్తం రూ. 10,200 కోట్లు రుణదాతలకు పంపిణీ అవుతుందని, రిలయన్స్ క్యాపిటల్ రూ. 16,000 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉండగా, అందులో 65 శాతం బ్యాంక్‌లు రికవరీ చేసుకుంటాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఐఐహెచ్ఎల్ రిజల్యూషన్ ప్లాన్‌ను వచ్చే వారంలో ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌కు రిలయన్స్ క్యాప్ అడ్మినిస్ట్రేటర్ సమర్పిస్తారు.