Elon Musk & Jeff Bezos | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కుబేరులు టెస్లా సీఈవో ఎలన్‌మస్క్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నికర సంపద అక్షరాల 500 బిలియన్ల డాలర్లు. ఈ వారంలో టెస్లా స్క్రిప్ట్‌లు రికార్డు స్థాయిలో దూసుకెళ్లడంతో ఇది సాధ్యమైంది. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్లో ఈ రెండు సంస్థల షేర్లు.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించేశాయి. అంతే కాదు. ఎలన్‌మస్క్, జెఫ్ బెజోస్ ఇద్దరి వ్యక్తిగత సంపద కలిపితే.. అమెరికాలోని అతిపెద్ద బ్యాంక్.. జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో కంటే ఎక్కువ.
ఇదిలా ఉంటే, బిలియనీర్ల అన్ రియలైజ్డ్ లాభాలపై లెవీ రూపంలో పన్ను విధించాలని అమెరికా సెనెట్ ఫైనాన్స్ చైర్మన్ రోన్ వ్యాడెన్ ప్రతిపాదించారు. కానీ తర్వాత జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. అయితే బిలియనీర్లపై పన్ను పథకం పూర్తిగా రద్దు చేయొద్దని ఒత్తిడి తెచ్చారు. 10 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ సంపాదించిన వారిపై గరిష్ట ఇన్‌కం స్లాబ్ అమలులోకి తేవాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది.