ITR Filing | గత ఆర్థిక సంవత్సరా (2022-23)నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతున్నది. 2021-22 ఐటీఆర్ ఫైలింగ్స్తో పోలిస్తే ఈ దఫా శరవేగంగా ఐటీఆర్ ఫైలింగ్ జరుగుతన్నది. దేశంలో దాదాపు ఆరు కోట్ల మంది పన్ను చెల్లిస్తున్నారు. ఇప్పటికే రెండు కోట్ల మందికిపైగా ఐటీఆర్ ఫైల్ చేశారని ఆదాయం పన్ను విభాగం చెబుతున్నది. సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తు్న్నారు. చివరి క్షణం వరకు వేచి ఉండొద్దని కూడా చెబుతున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వేతన జీవులు సమర్పించిన ఐటీఆర్ పత్రాలను, వాటితో జత చేసిన డాక్యుమెంట్లను నిశితంగా తనిఖీ చేయనున్నది ఐటీ డిపార్ట్ మెంట్.. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి టూల్స్ వినియోగించనున్నది. మీరు సమర్పించిన పత్రాలు, మీకు వచ్చిన ఆదాయ మార్గాలను మీరు ఊహించని రీతిలో వెలికితీస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్.
ఐటీఆర్ ఫైలింగ్స్, వాటితోపాటు సమర్పించిన పత్రాలను సునిశితంగా తనిఖీ చేసేందుకు ఈ ఏడాది ప్రారంభం నుంచే కేంద్రీకరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆటోమేటెడ్, విస్తరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ఉపయోగిస్తారు. బ్యాంకు ఖాతాల్లో అనుసంధానించిన పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ఆధారిత సమాచారాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ టూల్ వెలికి తీస్తుంది. వేతన జీవులు సమర్పించిన పత్రాలను సరిపోల్చి చూస్తుంది.
ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్లు, త్రైమాసికం వారీగా వడ్డీ క్రెడిట్, షేర్ డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు తదితర లావాదేవీలను పాన్ కార్డ్ సాయంతో వెలికి తీస్తాయి. కొన్ని సందర్భాల్లో ఐటీఆర్ల్లో బయట పెట్టని బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు కూడా చెక్ చేస్తాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, టీడీఎస్ డేటా సరిపోల్చి చూస్తాయి. పన్ను రాయితీ కోసం విరాళాలు
ఇచ్చినట్లు పత్రాలు చూపినా.. పాన్ కార్డు సాయంతో తేలిగ్గా తేల్చేస్తుంది ఏఐ టూల్. తేడాలు ఉంటే ఆదాయం పన్ను చట్టంలోని 143 (ఐ), 148 (ఏ) సెక్షన్ల కింద సంబంధిత పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేస్తుంది. కనుక ఐటీఆర్ ఫైలింగ్ టైంలో చార్టర్డ్ అకౌంటెంట్ల సాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.